Sunday, March 16, 2025

శైలజానాథ్ చేరికతో మారనున్న సమీకరణలు.. జగన్ ఆలోచన అదే

- Advertisement -

ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే స్పెషల్. అన్ని పార్టీలు ఆ సెగ్మెంట్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. అక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే జరుగుతూ వస్తోంది. అలాంటి సెగ్మెంట్లో తాజాగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏది? ఏంటా కథ? అంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో సింగనమల నియోజకవర్గం వర్గానికి ప్రత్యేకత ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. అయితే అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న శైలజనాథ్ గత మూడు ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. తప్పకుండా ఆయన చేరిక ప్రభావం చూపుతుంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రభావం చూపగలరు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉంది. అయితే ఏపీలో మాదిగలు విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు కనిపిస్తోంది. ఎస్సీల్లో ఇతర వర్గాలంతా వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే. 2014 ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచింది ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే. 2019 ఎన్నికల్లో అయితే దాదాపు ఆ నియోజకవర్గాల్లో క్లీన్ స్లీప్ చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో అదే ప్లాన్ చేయాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గాల నేతలు చెక్కుచెదరలేదు. కానీ మాదిగల విషయానికి వచ్చేసరికి మాత్రం వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. పైగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ టిడిపి మద్దతుదారుడుగా ఉన్నారు. పైగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు టిడిపికి సానుకూలంగా ఉన్నారు. ఈ పరిణామాల నడుమ మాదిగ వర్గాల్లో బలమైన నేత అవసరం అని భావించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన శైలజానాద్ ను పార్టీలోకి రప్పించారు.

అటు సింగనమల నియోజకవర్గం లో సైతం తనకంటూ ప్రత్యేక పట్టు నిలుపుకుంటూ వచ్చారు శైలజానాథ్. 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయంలో శైలజానాథ్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉంటే కీలక నేతగా ఎదిగేవారు. కానీ స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనను ఏపీ చీఫ్ చేసింది. పార్టీ మళ్లీ పుంజుకుంటుందని భావించిన శైలజానాథ్ అలానే ఉండి పోవడం ఆయనకు మైనస్ గా మారింది.

ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకత్వం లేదు. శైలజానాథ్ చేరికతో ఆయనకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 2019లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే శ్రీదేవి పై వ్యతిరేకత ఉండడంతో పక్కకు తప్పించారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో శైలజానాథ్ వైసీపీలోకి వెళ్లి ఉంటే ఆయన అభ్యర్థి అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి చేతిలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ టిడిపి ఎమ్మెల్యే దూకుడుగా ఉన్నారు. ఆ దూకుడుకు చెక్ చెప్పాలంటే మాత్రం శైలజానాధ్ కే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్ చేరిక విషయంలో రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి మాదిగల మద్దతు సొంతం చేసుకోవడం.. రెండు సింగనమల నియోజకవర్గం లో బలమైన అభ్యర్థిత్వానికి తెర తీయడం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్పకుండా విజయవంతం అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!