ఎప్పుడైనా అధికారపక్షాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేయాలి. కానీ ఏపీలో మాత్రం అందుకు పరిస్థితి విరుద్ధంగా ఉంది. విపక్షంగా ఉన్న వైసీపీపై విమర్శలు చేస్తున్నారు పిసిసి చీఫ్ షర్మిల. ఎన్నికలకు ముందు అలానే చేశారు.. ఎన్నికల తరువాత కూడా దానిని కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. అయితే ఫలితాలు వచ్చిన తరువాత కూడా అదే పరంపర కొనసాగించారు. ఇప్పుడు దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఇప్పటికీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. అందుకే ఇప్పుడు కూటమికంటే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను పార్టీలోకి తెచ్చుకొని.. గట్టి యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టిన షర్మిలకు షాక్ ఇస్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పై యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది వైసిపి హై కమాండ్. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డి. అయితే అందులో సొంత అజెండా ఉందని భావించిన కాంగ్రెస్ పెద్దలు అనుమతించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వైసీపీని ఏర్పాటు చేశారు. ముందుగా ప్రతిపక్షంలోకి వచ్చారు. అనంతరం అధికారాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.
అయితే తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు. కనీసం ఏపీలో కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 40 శాతం ఓట్లతో బలంగా కనిపించే కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తన వైపు చూసుకునేలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీకి ఏపీలో సారధ్యం వహిస్తున్న సోదరి షర్మిలను గట్టి దెబ్బ తీయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఆమెను ఏకాకి చేయగలిగారు. దాదాపు కాంగ్రెస్ లో మిగిలిన నేతలను అంత వైసీపీలోకి రప్పించేందుకు ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు.
అయితే వైసీపీలో నేతలను బయటకు రప్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అచేతనం చేయాలని చూస్తోంది కూటమి. దానిని తిప్పి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను వైసీపీలోకి రప్పించాలని జగన్ చూశారు. జగన్ టార్గెట్ షర్మిల. జగన్ మిషన్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం. తద్వారా తన పార్టీని బలోపేతం చేసుకోవడం. అదే సమయంలో కూటమికి ఎదురెళ్ళడం. వచ్చే ఎన్నికల నాటికి తన టీం ను సిద్ధం చేసుకోవడం. ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి