ఏపీలో కీలక నియోజకవర్గాల్లో డోన్ ఒకటి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం నుంచి ఎంతోమంది హేమాహేమీలు విజయం సాధించారు. అటువంటి నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సిట్టింగ్ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యాక్టివ్ గా లేరు. అయితే ఆ నియోజకవర్గంలో కొత్త నేతను బరిలో దించుతారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి భారీ వ్యూహం రూపొందించినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పార్టీ వెంట నడిచారు. రాజేంద్రనాథ్ రెడ్డి విద్యాధికుడు. మంచి వాగ్దాటి కలిగిన నేత. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు తొలిసారిగా 2014లో డోన్ వైసిపి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం దక్కింది. మృదుస్వభావి, ఆపై సంస్కారవంతుడు అన్న పేరు ఆయనకు ఉంది. శాసనసభ చర్చల్లో సరళమైన, చలోక్తులతో విషయ పరిజ్ఞానంతో కూడిన ప్రసంగాలు చేసేవారు. అందరి మన్ననలు పొందేవారు.
2019లో డోన్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డి అతడిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు అదే పదవిలో కొనసాగుతూ వచ్చారు రాజేంద్రనాథ్ రెడ్డి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలామంది మంత్రులను పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ విషయంలో మాత్రం రాజేంద్రనాథ్ రెడ్డికి మినహాయింపు. అదే ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్లపాటు కొనసాగించారు. ఈ ఎన్నికల్లో రాజేంద్రనాథ్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయన ఓటమి చవిచూశారు. దీంతో ఆయన స్థానంలో కుమారుడుని బరిలో దించుతారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సేవలను ఇంకోలా వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డిని డోన్ ఇన్చార్జిగా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రణాళిక పూర్తయిందని.. త్వరలో డోన్ నియోజకవర్గ ఇన్చార్జిగా బుగ్గన అర్జున్ రెడ్డి పేరు ఖరారు అవుతుందని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.