నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి. విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారు. సుగాలి ప్రీతి కేసు గుర్తుంది కదూ. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సుగాలి ప్రీతి అనే పదో తరగతి చదువుతున్న బాలిక. ఆమెను రేప్ చేసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానిస్తూ ఆందోళనకు దిగారు. ప్రజా సంఘాల ఆందోళనతో నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిందితులపై కేసు నమోదు చేసింది. జైల్లో కూడా పెట్టింది. అయితే నిందితులు కొద్ది రోజులకే బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ను కలిసింది మృతురాలు తల్లి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. కేసులో ఎటువంటి పురోగతి లేకపోగా.. ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.
కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ లో 2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి బాయ్ అనే బాలిక అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంటూ కనిపించింది. అయితే ఆమెది ఆత్మహత్య కాదని.. రేప్ చేసి చంపేశారని.. పాఠశాల యజమాని కుమారులు నిందితులంటూ మృతురాలి తల్లిదండ్రులు రాజు నాయక్ పార్వతీదేవిలు ఆరోపించారు. అదే సమయంలో పోస్ట్ మార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి జరిగిందని తేలింది. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాఠశాల యజమానితో పాటు ఆయన కుమారులపై సైతం అభియోగాలు మోపారు. దీంతో నిందితులపై రేప్ కేస్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. నాటి కర్నూలు జిల్లా కలెక్టర్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సైతం బాలికపై లైంగిక దాడితో పాటు హత్య జరిగినట్లు నిర్ధారించింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారు బయటకు రిలీజ్ అయ్యారు. అప్పటినుంచి ఆ బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. వారి పోరాటానికి ఫలితంగా సిబిఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. కానీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు.
అయితే సుగాలి ప్రీతి బాయ్ తల్లి పార్వతి దేవి అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అప్పటినుంచి సుగాలి ప్రీతి కేసును ప్రత్యేకంగా ప్రస్తావించేవారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఒక బాలికను దారుణంగా హత్య చేసి చంపితే పట్టించుకోని వారు.. గులకరాయి దెబ్బను తట్టుకోలేరా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి చాలా రోజులు అవుతున్న కేసులో ఎటువంటి పురోగతి లేదు.
అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి తప్పుకునేందుకు సిబిఐ నిర్ణయించింది. ఈనెల 13న హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టాల్సిన అంశాలు ఏవి లేవని.. అంతటి సంక్లిష్టత కూడా ఏదీ కనిపించడం లేదని సిబిఐ స్పష్టం చేసింది. తమకు చాలా రకాల కేసులు ఉన్నాయని.. తమను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలని సిబిఐ వాదించింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోగా.. ఇప్పుడు సిబిఐ పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఉంది. దీంతో పవన్ మాటలు గాలి మూటలేనని తేలిపోయింది.