వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు తత్వం బోధపడిందా? నమ్మిన వారే ఆమెను నట్టేట ముంచారా? వైయస్ షర్మిల ఆమెను పట్టించుకోవడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముందుకు కదలడం లేదు. షర్మిల పట్టించుకోవడం లేదు. కనీసం దాని ప్రస్తావన కూడా లేదు. దీంతో సునీతలో ఒక రకమైన ఆవేదన పెరుగుతోంది. షర్మిల తీరుపై అనుమానం మరింత రెట్టింపు అవుతోంది. అనవసరంగా తనను వివాదాల్లోకి తెచ్చింది అంటూ ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వైయస్ వివేకానంద రెడ్డి. అయితే ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసిన పని అన్న అనుమానాలు పెరిగాయి. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై సానుభూతి పెరగడానికి ఇది ఒక కారణంగా మారింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నీరుగార్చే ప్రయత్నాలు చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా నిందితులను కొమ్ముకాస్తున్నారు అన్న విమర్శ ఉంది. అప్పటినుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది. సొంతవారే తన తండ్రిని మట్టుబెట్టారని సునీత ఆరోపించడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులతో చేయి కలపడం ప్రారంభించారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించారు సోదరి షర్మిల. శత్రువుకు శత్రువు మిత్రులు అన్నట్టు ఆమె సైతం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులతో చేతులు కలిపారు. ఇద్దరు చెల్లెళ్ళు రాజకీయ శత్రువులుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా.. ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మిత్రులుగా చాలా రకాల సహకారాలు అందించుకున్నారు.
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నారు షర్మిల. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే తెలంగాణలో తన పార్టీని విస్తరిస్తానని కలలు కన్నారు. వర్కౌట్ కాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయారు. అదే సమయంలో తన నాయకత్వాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు షర్మిల. వైయస్ సునీతకు అండగా నిలబడుతున్నట్లు ప్రకటనలు చేశారు. చివరివరకు పోరాడుదామని కూడా నమ్మబలికారు. కానీ గత ఎనిమిది నెలలుగా ఆమె నోటి నుంచి వివేకానంద రెడ్డి అన్న మాట రావడం లేదు. సునీతలో అనుమానం పెరగడానికి అదే ప్రధాన కారణం.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ శరవేగంగా జరుగుతుందని భావించారు సునీత. కానీ ఈ కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. స్వయంగా సునీత సీఎం చంద్రబాబును కలిశారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను రెండుసార్లు ఆశ్రయించారు. చేద్దాం చూద్దాం అన్నమాట తప్ప వారి నుంచి సరైన హామీ రాలేదు. కేసు విచారణ ప్రారంభం కాలేదు. అదే సమయంలో షర్మిల సైతం సైలెంట్ అయ్యారు. దీంతో సునీతలో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయింది. అక్క అదేంటి అంటూ ఆమె ప్రశ్నించేసరికి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సునీతలో ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతోంది. అనవసరంగా ఏవేవో చేశానని.. సొంత వారిని దూరం చేసుకున్నానని ఆమె ఆవేదనతో బాధపడుతున్నట్లు సమాచారం.