వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీకి గుడ్ బై చెబుతారా? అదే జరిగితే ఏ పార్టీలో చేరతారు? టిడిపిలో చేరతారా? భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారా? అసలు ఆయన ఆప్షన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు. మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. మంచి పట్టున్న నేత కూడా. కానీ ఈ ఎన్నికల్లో ఓ సామాన్య సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. అది కూడా 52,000 ఓట్ల తేడాతో. రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా వ్యవహరించిన ఆయన ఓ సామాన్య యువకుడి చేతిలో ఓడిపోవడానికి తట్టుకోలేకపోతున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. అయితే కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నారు. అందుకు సరైన పార్టీ కోసం వెతుకుతున్నారు.
యూత్ కాంగ్రెస్ లీడర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి ఎంపీపీ అయ్యారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నరసన్నపేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చింది. అది మొదలు ఆయన రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. 1994లో రెండోసారి గెలిచారు ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయిన ధర్మాన ప్రసాదరావు మాత్రం గెలిచారు. 1999 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2004, 2009లో గెలిచి వరుస పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో అయీష్టంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన.
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావుకు ఓటమి తప్పలేదు. 2019లో రెండోసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి దక్కక పోయేసరికి మనస్థాపానికి గురయ్యారు. అయితే విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు చోటు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకుండా పోవడంతో అయిష్టంగానే కొనసాగారు. ఈ ఎన్నికల్లో తాను తప్పుకొని తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు అవకాశం ఇవ్వాలని కోరారు ధర్మాన ప్రసాదరావు. కానీ జగన్మోహన్ రెడ్డి అంగీకరించకపోవడంతో ఆయనే స్వయంగా పోటీ చేశారు. డిజాస్టర్ ఫలితాలను చవిచూశారు. అయితే ఇప్పుడు తన కుమారుడి కోసం పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. చివరకు రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీకి దూరమవుతారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న ధర్మాన ప్రసాదరావు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఇప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళరని అనుచరులు చెబుతున్నారు. అలా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయన 2029 ఎన్నికల వరకు వెయిట్ చేస్తారని.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాజకీయాలు చేయడం కష్టమని.. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్ట స్థితిలో ఉందని.. అందుకే తన కుమారుడిని టిడిపిలోకి పంపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఆ సీనియర్ నేత నిర్ణయం ఏంటనేది భవిష్యత్తులో తెలియనుంది. అంతవరకు వేచి ఉండక తప్పదు.