జనసేన నేత కిరణ్ రాయల్ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా? ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనా? ప్రజాక్షేత్రంలో ఆయన కు ఛాన్స్ లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రంలో జనసేనకు పేరు మోసిన నాయకులు ఉన్నారు. కానీ తొలి పది పేర్లలో కిరణ్ రాయల్ ఉంటారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపించారు కిరణ్ రాయల్. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజకీయ భవిష్యత్తును చేజేతుల పోగొట్టుకున్నారు. ఆయన భవితవ్యం ప్రమాదంలో పడిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీ మూలాలనుంచి వచ్చిన వారే కిరణ్ రాయల్. తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రకటించడం వెనుక కిరణ్ రాయల్ పాత్ర ఉంది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా తనదైన ముద్ర చూపారు. అంచలంచలుగా ఎదుగుతూ ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకం అయ్యారు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో కొద్ది రోజులపాటు సైలెంట్ అయిపోయారు. అయితే జనసేన ఆవిర్భావంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. జనసేన నేతల్లో కీలక వ్యక్తిగా మారిపోయారు.
2019 ఎన్నికల్లో జనసేన దారుణంగా ఓడిపోయింది. ఆ సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపించిన వారిలో కిరణ్ రాయల్ ఒకరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడంలో ముందుండే వారు. ఈ క్రమంలో దూకుడుగా వ్యవహరించేవారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అరెస్టు కూడా జరిగింది. దీంతో కిరణ్ రాయల్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది.
అయితే నాణానికి మరోవైపు అన్నట్టు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ రాయల్ చీకటి కోణం బయటపడింది. లక్ష్మీ రెడ్డి అనే బాధితురాలు తాను మాసపోయానని మీడియా ముందుకు రావడం.. కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేయడంతో జనసేన నాయకత్వం స్పందించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచింది. అయితే రోజుకో రీతిలో కిరణ్ రాయల్ వ్యవహార శైలిపై వీడియోలు వెలుగు చూస్తుండడం సంచలనం కలిగిస్తోంది. చివరకు పవన్ కళ్యాణ్ ను సైతం బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి కిరణ్ రాయల్ ఎదిగారు అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. కిరణ్ రాయల్ విషయంలో ఇలానే విడిచి పెడితే పార్టీ మెడకు చుట్టడం ఖాయమని జనసేన నాయకత్వం సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శాశ్వతంగా జనసేన నుంచి బహిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో జనసేనలో కిరణ్ రాయల్ కు వ్యతిరేక వర్గం, ప్రత్యర్థి వర్గం అంత ఏకతాటి పైకి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.