Sunday, March 16, 2025

ఆ రెండు సామాజిక వర్గాల అండ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటం!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత కొత్త లెక్కలతో ముందుకు వస్తున్నారా? సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని సరికొత్త అస్త్రం విసరనున్నారా? పోయిన చోట వెతుక్కోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాలది కీలక భూమిక. ప్రధాన సామాజిక వర్గాలు పార్టీల వారీగా విడిపోతుంటాయి. అయితే అందులో రెండు సామాజిక వర్గాలు కలిస్తేనే సత్ఫలితాలు వస్తాయి.మొన్నటి ఎన్నికల్లో జరిగింది అదే. కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం ఏకతాటిపైకి రావడంతో కూటమికి అధికారం దక్కింది. అదే సమయంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ కావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం అండదండలు పొందాలని భావిస్తున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలతో రాజకీయం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టి ప్లాన్ చేస్తున్నారు.

గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సమప్రా ధాన్యం ఇచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ గా ఉండే బీసీలను తన వైపు తిప్పుకోవాలని భావించారు. వారికి పెద్ద పీట వేస్తూ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేశారు. దీంతో సమాజంలో అగ్రభాగంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు తనకు అండగా నిలబడతారని అంచనా వేసుకున్నారు. ఆపై రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది కదా అని ధీమాతో ఉండేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకలా తలిస్తే.. ప్రజలు ఒకలా తలిచారు. ఫలితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది.

గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది కాపు నేతలకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, పేర్ని నాని, ఆమంచి కృష్ణమోహన్.. ఇలా చాలామంది నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇంత చేసిన కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ రూపంలో కూటమికి దగ్గర అయింది. అదే సమయంలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని సొంత సామాజిక వర్గం లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిణామాలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యాయి.

అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే అసంతృప్తితో దూరమైన నేతలను తిరిగి దగ్గర చేర్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అదే సమయంలో తెలంగాణలో బలిజలను సైతం దగ్గర చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి కోస్తాంధ్రలో ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాపు సామాజిక వర్గం నేతలను నియమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి రెడ్డి, కాపు సామాజిక వర్గాల అండదండలు అందుకోవాలని చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!