ఏపీ సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. నందమూరి కుటుంబాన్ని మరోసారి రాజకీయంగా వాడుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన జారవిడుచుకోవడం లేదు. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్నారు నారా లోకేష్. అవకాశం చిక్కినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ ప్రాపకం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనలు చాలా శరవేగంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆయన ఏపీలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో ఎలా పార్టీని విస్తరించాలి అన్నది ఆయన ఆలోచన. ఎలాగూ కేసీఆర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఆ పార్టీలో ముఖ్య నేతలు టిడిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టిడిపి గూటికి వచ్చారు. మాజీ మంత్రి బాబు మోహన్ సైతం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి తో పాటు నామ నాగేశ్వరరావు లాంటి నేతలు తిరిగి తెలుగుదేశంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడే చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీటీడీపీ బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2018లో నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి చంద్రబాబు వెన్నంటే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆమెకు బాధ్యతలు ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ లను తన రూట్లోకి తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
మొన్న ఆ మధ్యన లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో హల్చల్ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో ఓ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన టిడిపి అభిమానుల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకొని సందడి చేశారు. తద్వారా మా మధ్య విభేదాలు లేవని సంకేతాలు పంపారు.
తాజాగా కళ్యాణ్ రామ్ సైతం తన సినిమా ప్రమోషన్ లో భాగంగా లోకేష్, బాలయ్య, చంద్రబాబు ఉన్న టిడిపి జెండాను ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ చర్యలతోనే కళ్యాణ్ రామ్ ఇలా రూటు మార్చారన్న టాక్ వినిపిస్తోంది.
అయితే గతంలో ఎన్నడూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయంలో తండ్రి కొడుకులు సానుకూలంగా స్పందించలేదు. కానీ ఇప్పుడు వ్యవహార శైలి మార్చారు. అంటే తమకు అనుకూలంగా మార్చుకొని.. నందమూరి ఫ్యామిలీతో మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు అనుకుంటే ఏదైనా సాధ్యమే.