Wednesday, March 19, 2025

నగిరి నియోజకవర్గ బాధ్యతలు ఆయనకే.. రోజాకు పార్టీ సేవలు!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తగిలిన దెబ్బలను గుణపాఠాలుగా మార్చుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మొహమాటలకు వెళ్ళకూడదని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాల రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పార్టీలో కీలక మార్పులు చేసుకుంటున్నారు. అవసరం అనుకుంటే కీలక నేతలను సైతం పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆమె సేవలను పార్టీకి పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో నగిరి నియోజకవర్గంలో వేరే వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో నగిరి నుంచి పోటీ చేసిన ఆర్కే రోజా ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనం వీచినా.. నగిరి లో మాత్రం తక్కువ మెజారిటీతో గట్టిక్కారు రోజా. అయితే రోజా విధేయతను, పోరాటపటిమను గుర్తించుకున్న జగన్మోహన రెడ్డి ఆమెకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైసిపి అధికారంలోకి రాగానే సిఆర్డిఏ చైర్మన్ పోస్ట్ కట్టబెట్టారు. విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిలిచాయి. టికెట్ వద్దని వారించాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆమెపై నమ్మకం పెట్టుకున్నారు. టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. కానీ ఏకంగా ఆమె 45 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

అయితే నగిరిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆర్కే రోజాను పక్కకు తప్పిస్తారని ప్రచారం ప్రారంభం అయింది. అక్కడ గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఎన్టీఆర్ తో మంచి సన్నిహితం ఉన్న నేత. అందుకే టిడిపి సంక్షేమ సమయంలో ఎన్టీఆర్ వైపు నిలిచారు. పాపం అదే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారింది. ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. చంద్రబాబు సరైన గుర్తింపు ఆయనకు ఇవ్వలేదు.

పుత్తూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున నగిరి నుంచి గెలిచారు. 2014 ఎన్నికల కు ముందు టిడిపిలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణం పొందారు. తండ్రి రాజకీయ వారసత్వానికి ఇద్దరు కుమారులు పోటీపడ్డారు. దీంతో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని ముద్దుకృష్ణమ భార్యకు ఇచ్చారు.

2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారులు గాలి భాను ప్రకాష్, జగదీష్ టిడిపి టికెట్ కోసం పోటీపడ్డారు. కానీ చంద్రబాబు భాను వైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల్లో నీకు అవకాశం కల్పిస్తాను అంటూ జగదీష్ కు హామీ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో భాను ప్రకాష్ ఓడిపోయారు. గత ఐదేళ్లుగా ఇద్దరు అన్నదమ్ములు టిడిపి బలోపేతానికి కృషి చేశారు. కానీ జగదీష్ కు ఇచ్చిన మాటను తప్పరు చంద్రబాబు. తిరిగి భాను ప్రకాష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు జగదీష్. కుటుంబ శ్రేయోభిలాషులు సముదాయించడంతో సోదరుడు గెలుపు కోసం సహకరించారు. అయితే ఇప్పుడు గెలిచిన తర్వాత భాను ప్రకాష్ తమ్ముడు జగదీష్ ను తొక్కడం ప్రారంభించాడు. చంద్రబాబు సైతం పట్టించుకోకపోవడంతో జగదీష్ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత నెలలో జగదీష్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. నగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రోజా సేవలను మరోలా వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే రోజాను సైట్ చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం నడుస్తోంది. మరి నగిరి నియోజకవర్గ పరిణామాలు మున్ముందు ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!