Wednesday, March 19, 2025

నాడు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి.. నేడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ఆ నేతలు

- Advertisement -

వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరులోనే ఒక ఫైర్ ఉంది. తన కనుసన్నల్లో ఈ రాష్ట్రాన్ని పాలించారు. సుపరిపాలన అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే జగన్మోహన రెడ్డిలో తండ్రి రాజశేఖరరెడ్డిని చూసుకున్నారు. అందుకే చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అచేతనంగా మారిన సమయంలో.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి. 1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూడడంతో.. ఇక ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ హవా తగ్గిందని ప్రచారం ఉవ్వెత్తున ఎగసింది. ఇటువంటి తరుణంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి నడుంబిగించారు. 2003లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రికార్డులను తిరగరాశారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దగ్గర చేశారు. పార్టీకి ఘన విజయాన్ని అందించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.

2004 ఎన్నికల్లో ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు రాజశేఖర్ రెడ్డి. అసలు రాజకీయ వాసన లేని చాలామంది నేతలను, తటస్తులను రాజకీయాల్లోకి తెచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టి వారి విజయానికి దోహదపడ్డారు. చట్టసభల్లో అడుగు పెట్టేందుకు కారణమయ్యారు. సుపరిపాలన అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా వారికి అవకాశం ఇచ్చారు. అందుకే ఆయన అకాల మరణంతో కుమారుడు జగన్మోహన్ రెడ్డిలో అతడిని చూసుకున్న నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాణించిన నేతలు వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు.. అటువంటి వారంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఎంతోమంది తటస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటువంటి వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. అతడిలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. 2004లో తొలిసారిగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు అరుణ్ కుమార్. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2009లో సైతం ఆయనకే ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. మహానేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండోసారి కూడా విజయం సాధించారు ఉండవల్లి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అడ్డగోలుగా తీసుకోవడంతో నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఉండవల్లి. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

2004లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు పల్లంరాజు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. ఆపై వివాదరహితుడు కూడా. ఎంపీగా గెలవడంతో రాజశేఖర్ రెడ్డి సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం సహాయ మంత్రిగా ఎంపిక చేసింది. 2009లో సైతం రెండోసారి గెలిచారు పల్లంరాజు. అప్పుడు కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమని తెలుస్తోంది.

అమలాపురం రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు జివి హర్ష కుమార్. 2004లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సైతం తన విజయ పరంపరను కొనసాగించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అనంతపురం జిల్లా రాజకీయ వ్యవహారాలను చూసేవారు రఘువీరారెడ్డి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు రాజశేఖర్ రెడ్డి. ఆ మహానేత ఇచ్చిన స్వేచ్ఛతో వ్యవసాయ శాఖలో వినూత్న మార్పులు తీసుకొచ్చారు. 2009లో సైతం అదే శాఖను దక్కించుకున్నారు. నాడు వైయస్ క్యాబినెట్లో ఆయనతో అత్యంత చనువు ఉన్న వ్యక్తి కూడా రఘువీరారెడ్డి కావడం విశేషం. అనంతపురం జిల్లా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రఘువీరారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత గా గుర్తింపు పొందారు సుంకర పద్మశ్రీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. రాజశేఖర్ రెడ్డి ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె నామినేటెడ్ పదవి దక్కించుకుంటుందన్న క్రమంలో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందారు. లేకుంటే ఆమె చట్టసభల్లో అడుగుపెట్టడం ఖాయం. అందుకే నాడు తండ్రి హయాంలో జరగనిది తాను చేసి చూపిస్తానని మహిళా నేతకు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. సుంకర పద్మశ్రీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే నాడు తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన నేతలు.. నేడు కుమారుడు జగన్మోహన్ రెడ్డితో అడుగులు వేయడానికి ప్రయత్నిస్తుండడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!