Tuesday, April 22, 2025

తమిళనాడులో జనసేన ఎంట్రీ సాధ్యమేనా? పవన్ వెనుక బిజెపి!

- Advertisement -

తమిళ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇస్తుందా? ఏంట్రీ ఇస్తే అక్కడ సక్సెస్ కాగలదా? కానీ పవన్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? బిజెపిని బలపరిచేందుకా? లేకుంటే నిజంగా ఆ ఆలోచన ఉందా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది.

తమిళనాడు రాజకీయాలపై ఇటీవల తరచూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. తమిళుల్లో ప్రాంతీయ అభిమానం అధికం. తమ స్వరాష్ట్రంతో పాటు భాష పై ఎక్కువగా మక్కువ చూపుతారు. గత కొద్ది రోజులుగా హిందీని రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ విషయంలో అక్కడ రాజకీయాలను పక్కనపెట్టి నేతలంతా కలిసి ఖండిస్తారు. తమ ప్రాంతీయ వాదాన్ని ఎవరు వ్యతిరేకించినా వారు ప్రత్యర్థులుగా భావిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అక్కడ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ అదే సమయంలో ఒక ప్రత్యేక వర్గంగా ఉన్నవారు పవన్ చర్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

తమిళంతో తెలుగుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల ప్రభావం అధికం. అక్కడి హీరోల సినిమాలను తెలుగువారు చూస్తారు. ఇక్కడి వారి సినిమాలను తమిళులు ఆదరిస్తారు. అందుకే హీరోలకు ప్రత్యేక అభిమానులు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. అలానే పవన్ కళ్యాణ్ కు కూడా తమిళంలో ఫ్యాన్స్ ఉన్నారు.

తమిళనాడులో ప్రాంతీయవాదం అధికం. అందుకే అక్కడ జాతీయ పార్టీలు దశాబ్దాలుగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఒకవేళ ప్రభావం చూపాలనుకున్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు అనివార్యం. ఇక్కడ బిజెపి స్వతంత్రంగా ఎదగాలని చూస్తోంది. కానీ సాధ్యం కావడం లేదు. దీనికి తోడు బిజెపి జాతీయవాదాన్ని తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయితే తమిళనాడులో ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఒక అస్త్రంగా మారారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని పవన్ ప్రకటించారు. అంతకుముందే తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై భిన్నంగా స్పందించారు. ఆయన మాట్లాడిన తరువాతే పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దానికి తమిళనాడులోని ఓ వర్గం సమర్ధించింది కూడా.

అయితే తమిళనాడు విషయంలో బిజెపి అజెండాతో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఒక భిన్నమైన వాదనతో తమిళనాడులోకి ప్రవేశించాలని బిజెపి చూస్తోంది. సంప్రదాయ రాజకీయాల ద్వారా తమిళనాడులో పార్టీ ఎంట్రీ అంత సులువు కాదని తేలిపోయింది. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడింది బిజెపి.

వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలన్నది బిజెపి వ్యూహం. అందుకే పవన్ ను ఒక తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శన పూర్తి చేశారు. తమిళనాడుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు తరచూ తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ నేతల వైఖరిని విమర్శిస్తున్నారు.

అయితే తమిళనాడులో జనసేన ఎంట్రీ అంత ఈజీ కాదు. అంత రాజకీయ సూన్యత కూడా అక్కడ లేదు. ఇప్పటికే అక్కడ డిఎంకె, అన్నా డీఎంకే బలమైన పునాదులు ఏర్పాటు చేసుకున్నాయి. మరోవైపు చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఉనికి చాటుతున్నాయి. ఇటీవల తమిళ దళపతి విజయ్ పార్టీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తో పాటు బిజెపి సైతం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో పవన్ జనసేన ఎంట్రీ తమిళనాడులో ఏమాత్రం ప్రభావం చూపదని విశ్లేషకులు అభిప్రాయం. అయితే పవన్ ప్రకటన వెనుక బిజెపి ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి మరి పవన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో..

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!