విశాఖ జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి. అక్కడ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడ డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినా అక్కడ ప్రజలు తిరస్కరించారు. దీంతో పార్టీలో తీవ్ర అంతర్మధనం జరుగుతోంది. పార్టీని అక్కడ ఎలా బలోపేతం చేయాలి అన్నదానిపై జగన్మోహన్ రెడ్డి దీర్ఘాలోచనలో పడ్డారు.
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖ పట్టు చిక్కడం లేదు. 2014 ఎన్నికల్లో అక్కడ టిడిపి ఘన విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం విశాఖలో నాలుగు నియోజకవర్గాలను టిడిపి కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో అయితే కనీసం బోణీ కొట్టలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ అపజయం మాత్రం ఆ పార్టీని మరింత డిఫెన్స్ లో పెట్టింది.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉంటూనే ఆయన ఉన్నపలంగా పదవులను వదిలేసి బయటకు వెళ్ళిపోయారు.
మరోవైపు మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ రూపంలో నాయకుడు ఉన్న ఆయన కన్విన్స్ చేయలేకపోతున్నారు. బూడి ముత్యాల నాయుడు పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచే నాయకత్వం లేదు.
జగన్మోహన్ రెడ్డి విశాఖ విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజా మాజీలందరికీ పిలిపించి దిశ నిర్దేశం చేసినట్లు సమాచారం. విశాఖ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని విషయంపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ విశాఖ జిల్లా బాధ్యతలు తైనాల విజయ్ కుమార్ కు అప్పగించనునట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న నాయకుల్లో తైనాల పరవాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఉన్న ఆయన కంపెనీల కేసుల్లో చిక్కుకున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయన టిడిపి నుంచి వచ్చారు. ఓడిపోయిన తర్వాత భిన్న స్వరం వినిపిస్తున్నారు. అందుకే తైనాల విజయ్ కుమార్ అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు ఉన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణను నియమించారు. భీమిలి నియోజకవర్గ ఇన్చార్జిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు ఇచ్చారు. వీరందరి సహకారంతో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదుక్కునే బాధ్యతలను తైనాల విజయ్ కుమార్ పై పెట్టినట్లు సమాచారం. మొత్తానికైతే విశాఖ విషయంలో జగన్మోహన్ రెడ్డి గట్టి స్కెచ్ తోనే ఉన్నారు.