Tuesday, April 22, 2025

కొత్త పింఛన్లు లేవు.. ఉన్న పింఛన్లు ఊడుతున్నాయి.. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత!

- Advertisement -

ఏపీలో కొత్త పింఛన్ల జాడలేదు. ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారు. రకరకాల పేరు చెప్పి ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో లబ్ధిదారులు విలవిలాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ప్రతి నెల 10 వేల నుంచి 20 వేల వరకు పింఛన్లు తొలగిస్తూనే ఉన్నారు. దీనికి రకరకాల పేర్లు చెప్పి సమర్ధించుకుంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నవరత్నాల్లో భాగంగా భారీగా పింఛన్లు అందించారు. 14 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తూ వచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరి పింఛన్లు అందించేవారు. కానీ తాము అధికారంలోకి వస్తే రెట్టింపు పింఛన్లు ఇస్తామని.. 50 ఏళ్లు దాటిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు పింఛన్లు వర్తింప చేస్తామని చెప్పారు చంద్రబాబు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు.

దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై విచారణ కూడా చేపట్టింది. వైద్యుల బృందం ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. మరికొందరికి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి వైకల్య పరీక్ష చేశారు. అలా దివ్యాంగ పింఛన్లలో కోతకు సిద్ధమయ్యారు.

మరోవైపు అర్హత ఉన్న మూడు లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పింఛన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.

అయితే అనర్హుల పేరిట పెద్ద ఎత్తున పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ 10 నెలల కాలంలో లక్షలు పింఛన్లు తొలగించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే వాటికి సాంకేతిక కారణాలు చెబుతూ కాలం వెళ్ళదీస్తోంది ప్రభుత్వం. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప పింఛన్లు అందించే సాహసం చేయడం లేదు.

అధికారంలోకి వచ్చిన మరుక్షణం బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 50 సంవత్సరాలు దాటితే చాలు పింఛన్లు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో లక్షలాదిమంది లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు సంబంధించి కనీస కార్యాచరణ ఇంతవరకు ప్రారంభించలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. పింఛన్లలో కోతలు తప్ప కొత్తవి లేవంటూ ఎక్కడికి అక్కడే నిలదీతలు ప్రారంభం అవుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!