Wednesday, March 19, 2025

ఓ సీనియర్ నేత కోసం సిక్కోలుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిందే చేస్తున్నారు. అమలు చేసి చూపుతున్నారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 పార్టీ కార్యకర్తల కోసమేనని స్పష్టంగా చెప్పారు. పార్టీలో ఉండే వారికి మెరుగైన భవిష్యత్తు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. నేరుగా సబ్ జైలుకు వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించారు. అటు పార్టీతో పాటు ఇటు రాష్ట్ర ప్రజల కోసం గళం ఎత్తాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే గుంటూరు మిర్చి యార్డ్ లో రైతులను పరామర్శించి ఓదార్చారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తద్వారా కూటమి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. దీంతో చంద్రబాబు మిర్చి రైతుల గురించి స్పందించాల్సి వచ్చింది.

మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టారు. అయినా సరే అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా తరలివచ్చారు పార్టీ శ్రేణులు, అభిమానులు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖర్ మృతి చెందారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సన్నిహిత నేత కూడా. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రెండుసార్లు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ కృతజ్ఞతతోనే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఆ పార్టీలో చేరారు. చనిపోయే వరకు అదే పార్టీలో కొనసాగారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలవలస కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. రాజశేఖర్ తల్లి పాలవలస రుక్మిణమ్మ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. అటు తరువాత పాలవలస రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ ను మనసులో పెట్టుకున్నారు. అందుకే 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవీ అప్పగించారు. రెండోసారి కూడా ఛాన్స్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సైతం పాలవలస కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు.

పాలవలస రాజశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్దన్న పాత్ర పోషించారు. సీనియర్ నేతగా ఉంటూ పార్టీ బలోపేతానికి తనవంతు పాత్ర పోషించారు. తూర్పు కాపు సామాజిక వర్గాన్ని వైయస్సార్ కాంగ్రెస్ వైపు టర్న్ చేసేలా వ్యవహరించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కుమార్తె శాంతిని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి 2014లో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయేసరికి 2019లో పాతపట్నం అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచారు. మరోవైపు పాలవలస రాజశేఖర్ కుమారుడు విక్రాంత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తిరిగి శాంతికి పాతపట్నం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. కానీ ఆమెకు ఓటమి ఎదురైంది.

ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు పాలవలస రాజశేఖర్. అయితే ఒకవైపు వయోభారంతో మంచం పట్టారు. రెండు నెలల కిందట చనిపోయారు. అయితే అప్పట్లో విదేశీ పర్యటనలో ఉన్న జగన్మోహన రెడ్డి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఉత్తరాంధ్ర నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. పాలకొండ పట్టణం ఇసుకేస్తే రాలనంత గా మారిపోయింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు జగన్మోహన్ రెడ్డి. పాలవలస రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ సీనియర్ నేత సేవలను కొనియాడారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!