వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నేతలకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పదవులు కూడా ఇచ్చి గౌరవించారు. గత ఐదేళ్లు గౌరవభావంతో చూసుకున్నారు. ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న టిక్కెట్లు ఇచ్చారు. వారిని గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ ఓటమి ఎదురయ్యేసరికి ఒక్కో నేత గత పరిణామాలను మరిచిపోతున్నారు. పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఆ జాబితాలో చేరారు వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు వంగా గీత. ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వేదికగా జరిగే జనసేన ప్లీనరీలో ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
2024 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు వంగా గీత. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ గెలిచారు పెండ్యం దొరబాబు. అయితే కాపు సామాజిక వర్గం, ఆపై మహిళ నేత కావడంతో వంగా గీతను అక్కడ బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. కానీ పొత్తులో భాగంగా మూడు పార్టీలు సమన్వయంగా పనిచేయడంతో అక్కడ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటినుంచి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు వంగా గీత.
అయితే ఎన్నికల సమయంలోనే వంగా గీత పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంగా గీత జనసేనలో చేరుతారని కూడా చెప్పుకొచ్చారు. ఆమె పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆమె తప్పకుండా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు ఆమె.
వంగా గీత సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్న మహిళ నేత. 1985 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేశారు. 1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహించారు. 2000 నుంచి 2006 వరకు టిడిపి తరఫున రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ పార్టీ గొడుగు కిందకు చేరారు వంగా గీత. ఆ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆ పార్టీలో చేరిపోయారు. తరువాత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వంగా గీత. 2019లో మాత్రం కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి అదే పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వంగా గీతను తెచ్చి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆమెకు ఓటమి ఎదురైంది.
అయితే ఇటీవల వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆమె చాలా యాక్టివ్ గా పని చేశారు. మొన్న ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పర్యటనలో సైతం కనిపించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో ఆమె పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 14 న పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని సమాచారం.