జీవీ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? కొంతమంది రంగంలోకి దిగారా? ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టిడిపి ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులను వదులుకున్నారు ఆయన. అయితే ఆయన రాజీనామాతో తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. రెడ్డి సామాజిక వర్గం నేతలను వదులుకుంటున్నారని.. ఈ మొత్తం ఎపిసోడ్లో లోకేష్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు ప్రచారం నడుస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ప్రకటించారు. అయితే ఏపీ ఫైబర్ నెట్ పోస్ట్ చాలా కీలకం. నామినేటెడ్ పదవుల్లో పెద్దది కూడా. ఆ పదవిని కమ్మ సామాజిక వర్గం ఆశించింది. కానీ అనూహ్యంగా జీవి రెడ్డికి దక్కింది. అయితే ఫైబర్ నెట్ లో చాలా ఇష్యులు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల తొలగింపు తో పాటు కొత్త ఉద్యోగాల నియామకంలో జీవి రెడ్డి పారదర్శకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ సిఫారసులను పక్కన పెట్టడం వల్లే జీవి రెడ్డి రాజీనామాకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫైబర్ నెట్ చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది నేతలు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నేతలు ఆ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా జీవి రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇది కమ్మ నేతలకు మింగుడు పడలేదు. అందుకే జీవి రెడ్డి చుట్టూ కుట్ర పన్నారు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. అయితే జీవి రెడ్డి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం పెత్తనం అధికమైందన్న టాక్ వినిపిస్తోంది.
జీవి రెడ్డి రాజీనామాతో తెలుగుదేశం పార్టీలో ఒకరకమైన ప్రకంపనలు వచ్చాయి. నాయకత్వం తీరును ఎక్కువ మంది పార్టీ శ్రేణులు తప్పుపట్టారు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన చంద్రబాబు కొంతమంది నేతలను నియమించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొన్న బడ్జెట్ పై జీవి రెడ్డితో ఒక ట్వీట్ చేయించారని తెలుస్తోంది. జీవి రెడ్డి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొన్న రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు మరోసారి టిడిపిలోకి వెళ్లి పదవి తీసుకుంటే క్యారెక్టర్ కు డామేజ్ జరుగుతుందని జీవి రెడ్డి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.