జనసేన పై బీసీ వర్గాలు రగిలిపోతున్నాయి. బీసీలను విస్మరిస్తున్న జనసేనకు మున్ముందు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ తరఫున పదవులను ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెడుతుండడాన్ని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. జనసేన పూర్తిగా కాపుల పార్టీ అని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు.
జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ తనకు కులంతో సంబంధం లేదని.. తాను అందరి వాడినని తరచూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం తాను కొందరి వాడినేనని నిరూపించుకుంటున్నారు. పార్టీలో ఎమ్మెల్సీ పదవుల నుంచి మంత్రి పదవులు వరకు కాపులకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలను తొక్కేస్తున్నారన్న విమర్శ ఉంది.
జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో మెజారిటీ నేతలు మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందినవారు. బీసీల నుంచి గెలిచినవారు ఉన్నారు. అటువంటి వారిని కనీస పరిగణలోకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్. మంత్రి పదవుల కూర్పులో సైతం సామాజిక సమతూకం పాటించలేదు. జనసేనలో ముగ్గురు మంత్రులు అయ్యారు. అందులో ఇద్దరు కాపు.. మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు నాలుగో మంత్రి పదవి సైతం నాగబాబుకు ఇవ్వడం ద్వారా కాపుల ఖాతాలో వేశారు.
ఎన్నికలకు ముందు కులం చూడం అంటూ చెప్పుకొచ్చిన పవన్.. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. మా పార్టీలో పనితీరు కొలమానం అని.. సీనియార్టీని పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెబుతున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సామాజిక సమతూకం పాటిస్తూ ముందుకు సాగుతోంది. కానీ జనసేనలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
నాగబాబు ఎమ్మెల్సీ వరకు ఓకే.. మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రం ఇతర సామాజిక వర్గాల్లో ఆందోళన ఉండడం ఖాయం. జనసేనలోనే అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. జనసేనలో సైతం సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు. అందులో ఎమ్మెల్యేలు అయిన వారు ఉన్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు సీనియర్లు కూడా మంత్రి పదవులు ఆశించారు.
అనకాపల్లి నుంచి గెలిచారు సీనియర్ నేత కొణతాల రామకృష్ణ. ఆయనను జనసేనలోకి రప్పించి సీటు ఇచ్చారు పవన్ కళ్యాణ్. బీసీ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అంత భావించారు. కానీ పవన్ మాత్రం కాపులకు ఇచ్చుకుంటూ పోతున్నారు. తాను డిప్యూటీ సీఎం గా ఉండడమే కాకుండా కందుల దుర్గేష్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నాగబాబును సైతం మంత్రిని చేస్తున్నారు. దీంతో కొణతాల రామకృష్ణ లాంటి సీనియర్ నేతల్లో అసహనం పెరుగుతోంది.
పవన్ చర్యలతో తాము ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన ఎమ్మెల్యేలు. పార్టీలో అభిప్రాయాలు తీసుకోవడం లేదని.. ఏకాభిప్రాయానికి రావడం లేదని.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇదే పరిస్థితిని కొనసాగిస్తే మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..