Sunday, March 16, 2025

టిడిపి గూటికి కరణం బలరాం.. చీరాల ఎమ్మెల్యే కొండయ్య కు చెక్

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆయన సీనియర్ నేత. ఒక వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అటువంటిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన మనసు మారినట్లు ప్రచారం నడుస్తోంది. పాత పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు కరణం బలరాం. ప్రకాశం జిల్లాలో బలమైన నేత. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. కాకలు తీరిన రాజకీయ నాయకుడిగా.. చంద్రబాబు సమకాలీకుడిగా కరణం బలరాం కు పేరు ఉండేది. ప్రకాశం జిల్లా టిడిపిని వంటి చేత్తో నడిపిన ఘనత ఆయనది. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన టిడిపిని విడిచిపెట్టారు. ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల వెంకయ్య నాయుడు ఇంట్లో జరిగిన వేడుకలు నేరుగా సీఎం చంద్రబాబును కలిశారు. ఏకాంతంగా మంతనాలు జరిపారు. దీంతో బలరాం టిడిపిలో చేరుతారని ప్రచారం జోరుగా ప్రారంభం అయింది.

1978లో ఇందిరా కాంగ్రెస్ నుంచి అద్దంకి ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు కారణం బలరాం. 1983లో టిడిపిలో చేరి 2019 వరకు సుదీర్ఘకాలం ఆ పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం చీరాల నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కుమారుడిని బరిలోదించగా ఓటమి ఎదురైంది. అప్పటినుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తూ వచ్చింది. తాజాగా చంద్రబాబును కలవడంతో పతాక స్థాయిలో ఈ చర్చ నడుస్తోంది.

కరణం బలరాం భౌతికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న.. మనసంతా టిడిపిలో ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం కరణం బలరాంకు మంచి ప్రాధాన్యత దక్కింది. ఆమంచి కృష్ణమోహన్ ను పక్కన పెట్టి మరి.. 2024 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్నారు వెంకటేష్. అయితే అదే ఆమంచి కృష్ణమోహన్ కు అవకాశం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో పని చేయడం, కమ్మ సామాజిక వర్గ నేత కావడంతో కరణం బలరాంకు టిడిపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. గుంటూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య మనవడు విష్ణు నిశ్చితార్థంలో చంద్రబాబును కలిశారు బలరాం. ప్రత్యేకంగా సమావేశం కావడంతో కరణం కుటుంబం టిడిపిలో చేరడం ఖాయమని జిల్లా అంతటా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా టిడిపికి చెందిన కొండయ్య ఉన్నారు. ఆమంచి కృష్ణమోహన్ సోదరులతో కొండయ్య చేతులు కలిపారు అన్న సమాచారం చంద్రబాబుతో పాటు లోకేష్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే భవిష్యత్తు రాజకీయాల కోసం కరణం కుటుంబాన్ని టిడిపిలో చేర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే కరణం బలరాం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మార్గాలు లేనట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి కరణం బలరాం ది అద్దంకి నియోజకవర్గం. ప్రస్తుతం అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి రవికుమార్ కాదనుకుంటే కరణం బలరామును పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే కరణం బలరాం చీరాల నియోజకవర్గాన్ని ఎంచుకుంటే మాత్రం ఎటువంటి అభ్యంతరాలు ఉండవని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!