వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో మొహమాటలకు పోయి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకున్నారు. అందుకే ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావిస్తున్నారు. ఎంత పెద్ద నాయకులైనా మార్పు చేయాలంటే వెనుకడుగు వేయడం లేదు. పార్టీలో యాక్టివ్ అవ్వండి. లేకుంటే కొత్త నియామకాలు చేపడతానని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో ఎటువంటి మొహమాటలకు పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో ద్వితీయశ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాను సీనియర్ నని.. తన కుమారుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని తమ్మినేని సీతారాం కోరారు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలను చింతాడ రవికుమార్ కు అప్పగించారు. శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలను తమ్మినేనికి చూసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం అసెంబ్లీ సీటు విషయంలో సైతం సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు తేల్చి చెప్పినట్లు సమాచారం. యాక్టివ్ అయితే మీరు.. లేకుంటే మాత్రం తాను కొత్త నేతకు అవకాశం ఇస్తానని మొహమాటం లేకుండా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ధర్మాన మొన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఒక్కసారిగా కనిపించారు. ప్రత్యేకంగా కలిశారు. పార్టీలో యాక్టివ్ అవుతానని చెప్పుకొచ్చారు.
తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి అదే రకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ ముందుకు వచ్చారు. అయితే ఆయన వస్తే తన పరిస్థితి ఏంటని రోజా అడిగినట్లు సమాచారం. అయితే పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలని.. ప్రత్యామ్నాయంగా మీ సేవలను వినియోగించుకుంటామని రోజాకు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.
గతం మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరిస్తే కుదరదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీకి ఏది ప్రయోజనం అనిపిస్తే దానికి జై కొట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంలో ఎంతటి సీనియర్లు అయినా అతీతులు కారని.. మార్పులకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు రాష్ట్రంలో 50, 60 నియోజకవర్గాల్లో మార్పులకు శ్రీకారం చుట్టం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలో యాక్టివ్ లేని నేతల స్థానంలో కొత్త వారిని నియమిస్తామని.. అవసరమైతే ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే పార్టీలో మార్పు భయంతో ఎక్కువ మంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. నియోజకవర్గాల్లో ఎంట్రీ ఇస్తున్నారు.