ప్రకాశం జనసేనలో బల ప్రదర్శనకు దిగుతున్నారా? మాజీ మంత్రి బాలినేని వ్యతిరేక వర్గం స్ట్రాంగ్ అవుతోందా? అక్కడ రెడ్డి వర్సెస్ కాపు అన్న పరిస్థితికి మారిందా? ప్రకాశం జిల్లా బాధ్యతలు కాపులకు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ జనసేనలో పాత, కొత్త క్యాడర్ మధ్య సమన్వయం కుదరడం లేదు. పాత క్యాడర్ కు బలం లేదు. కొత్త క్యాడర్ కు బలం ఉన్న ఆదరణ లేదు. దీంతో ప్రకాశం జిల్లా జనసేన లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల అనంతరం జనసేన లోకి వెళ్లారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక పార్టీలో భవిష్యత్తు లేదని జనసేనలోకి జంప్ చేశారు. అయితే అక్కడ కూడా ఆయనకు అనుకూల పరిస్థితి లేదు. జనసేన నాయకత్వం పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. క్యాడర్ కలిసి రావడం లేదు. దీంతో ఆయన ఆలోచనలో పడిపోయారు. జనసేన నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్పొరేటర్ లను జనసేనలో చేర్చారు. మరో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును జనసేనలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో జనసేన జిల్లా పగ్గాలు ఇవ్వొద్దని పార్టీలో ఒక వర్గం నేతలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బాలినేనిని వ్యతిరేకించే వర్గమంతా అదే కోరుకొంటోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాలినేని మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో దూకుడుగా వ్యవహరించారు. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న టిడిపి, జనసేన నేతలను వెంటాడారు. అటువంటి వారంతా బాలినేనికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వొద్దని కోరుతున్నారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లా జనసేనలో కాపు వర్సెస్ రెడ్డి అన్న పరిస్థితికి వచ్చింది. జనసేన కాపులు పార్టీగా ముద్ర పడింది. అందుకే జిల్లా అధ్యక్ష పదవి కాపు సామాజిక వర్గానికి చెందిన కంది రవిశంకర్కు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో తన ముద్ర పోవడం ఖాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చారు బాలినేని. జనసేనలో చేరికను ఆ పార్టీ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంకోవైపు స్థానిక టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఇలా బాలినేని పై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవేళ ప్రకాశం జిల్లా పగ్గాలు బాలినేనికి అప్పగించుకుంటే మాత్రం ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.