ప్రకాశం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కరణం బలరాం. దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు ఆయన. కానీ తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టుకోలేకపోయాను అన్న బాధ ఆయనలో ఉంది. అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. భారీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన తనయుడు కరణం వెంకటేష్ ఓడిపోయారు. దీంతో వెంకటేష్ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా కరణం బలరాం కొత్త ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి చీరాల కాకుండా అద్దంకి లోనే తేల్చుకోవాలని కరణం బలరాం భావిస్తున్నట్లు సమాచారం. అద్దంకిలో దశాబ్దాలుగా కరణం వర్సెస్ గొట్టిపాటి కుటుంబం అన్నట్టు పరిస్థితి ఉండేది. ఆ రెండు కుటుంబాలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవి. రాజకీయంగా ముఖాముఖిగా తలపడేవి. ఇప్పుడు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ను తన కుమారుడు వెంకటేష్ తో ఓడించాలని గట్టి ప్రణాళిక వేసుకున్నారు బలరాం.
కరణం బలరాం టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలోనే గొట్టిపాటి కుటుంబంతో వైరం నడిచేది. గొట్టిపాటి కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. అటు తరువాత జగన్ పిలుపు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గొట్టిపాటి. 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ చెక్ చెప్పాలని భావించారు కరణం బలరాం. తన కుమారుడు వెంకటేష్ ను టిడిపి అభ్యర్థిగా అద్దంకిలో బరిలోదించారు. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ పోటీ చేశారు. రాష్ట్రమంతా టిడిపి గెలవగా.. అద్దంకిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్ గెలిచారు.
అయితే కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు గొట్టిపాటి రవికుమార్. దీంతో కరణం బలరాం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రవికుమార్ అద్దంకి నుంచి పోటీ చేశారు. కానీ అప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కరణం బలరాం తనయుడు వెంకటేష్ ఉండేవారు. తీవ్ర అసంతృప్తికి గురైన కరణం కుటుంబానికి అనూహ్యంగా చీరాల టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే అక్కడ నుంచి బలరాం గెలిచారు కానీ.. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో బలరాం పునరాలోచనలో పడ్డారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే ఈ ఎన్నికల్లో చీరాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కరణం వెంకటేష్. కానీ ఆయనకు ఓటమి ఎదురైంది. మరోవైపు అద్దంకి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ కు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో తన ప్రత్యర్థి రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్ళగా.. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు సెట్ చేయలేకపోయాను అన్న ఆందోళన కరణం బలరాం లో కనిపించింది. ఒకానొక దశలో ఆయన టిడిపిలోకి వెళ్తారని ప్రచారం నడిచింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి.. అద్దంకి నియోజకవర్గంలో తన చిరకాల ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు చెక్ చెప్పాలని భావిస్తున్నారు బలరాం. అందుకే ఇప్పుడు న్యూ లుక్ తో అద్దంకిలో హల్చల్ చేస్తున్నారు కరణం వెంకటేష్. మున్ముందు గొట్టిపాటి రవికుమార్ కు కరణం కుటుంబం ఎదురు వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తోంది.