మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి? ఆయనకు ముంబై తరలించే అంతటి విషమ పరిస్థితి ఉందా? హైదరాబాదులో ఎందుకు ఉంచలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది. త్వరలో ఆయన కోలుకునే అవకాశం ఉంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే హైదరాబాదులో కొడాలి నాని ఉన్నప్పుడు అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారట. గత కొన్నేళ్లుగా రాజకీయంగా దూకుడుగా ఉండేవారు కొడాలి నాని. ఆయనను వ్యక్తిగతంగా అభిమానించే వారి కంటే ద్వేషించే వారు ఎక్కువయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితికి వ్యతిరేకంగా చాలా రకాలుగా ప్రచారాలు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా గుండెపోటు విషయంలో విషప్రచారం చేసినట్లు ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 27న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటినుంచి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమాచారం ప్రత్యర్థులకు చేరుతోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అనుమానించారు అభిమానులు,అనుచరులు. ప్రతి అంశము ప్రత్యర్థుల చెవికి వెళ్తోందని గుర్తించారు ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యులు. అందుకే హైదరాబాదులో ఉంటే ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అనుమానించారు. అందుకే వెనువెంటనే ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించినట్లు తెలుస్తోంది.
గత ఐదు సంవత్సరాలుగా కొడాలి నాని రాజకీయంగా చాలా దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. సహజంగానే ఇవి చాలామందికి రుచించవు. తాము అభిమానించే నేతలను ఎవరైనా తిడితే చాలా రకాల ఉద్రేకాలకు లోనవుతారు. కొడాలి నాని విషయంలో జరిగింది అదే. ఓ సామాజిక వర్గంతో పాటు ఒక సెక్షన్ ప్రజలు కొడాలి నాని విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. ఈ నేపథ్యంలో నాని అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనపై కోపంతో ఉన్న ప్రత్యర్ధులు ప్రాణహాని కల్పిస్తారన్న అనుమానాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే నాని ఆరోగ్య విషయాలు ప్రత్యర్థుల చెవులకు ఇట్టే చేరిపోయాయి. వీటిని గుర్తించిన అనుచరులు, కుటుంబ సభ్యులు స్థానికంగా ఉంటే ఇబ్బందులు తప్పవని భావించారు. వెను వెంటనే ముంబాయి కి షిఫ్ట్ చేశారు.
ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ముంబై ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు విజయవంతంగా బైపాస్ సర్జరీ పూర్తయింది. దాదాపు 8 గంటల పాటు శ్రమించిన వైద్యుల బృందం ఆయనకు ఆపరేషన్ చేయడంలో సక్సెస్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొడాలి నాని అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొడాలి నాని కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగానే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా కనిపిస్తోంది.