Tuesday, April 22, 2025

మడకశిర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్..

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ ఓడిపోయింది. అందుకే ఇప్పుడు ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానంగా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో అక్కడ చివరి నిమిషంలో టిడిపి అభ్యర్థిగా వచ్చిన ఎం.ఎస్.రాజు విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడ ఆయన మాస్ లీడర్ గా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో అక్కడ సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచారు ఎం.తిప్పేస్వామి. కానీ ఆయనను పక్కకు తప్పించారు జగన్మోహన్ రెడ్డి. సాధారణ ఉపాధి వేతన దారుడుగా ఉన్న లక్కప్పను బరిలోదించారు. కొత్త ప్రయోగం చేశారు. కానీ అయిష్టంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేసినట్లు ప్రచారం ఉంది. అయితే కూటమి ప్రభంజనంలో చివరి నిమిషంలో వచ్చిన టిడిపి అభ్యర్థి ఎమ్మెస్ రాజు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెస్ రాజుకు చెక్ చెప్పాలంటే సరైన నేత అవసరం. ఓడిపోయిన లక్కప్ప క్యాడర్ను నిలబెట్టుకునే ఆర్థిక పరిస్థితి కానీ.. కమాండింగ్ గాని లేదు. దీంతో తిరిగి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. అటు హై కమాండ్ సైతం అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

తిప్పేస్వామి సీనియర్ పొలిటీషియన్. 1994లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పలమనేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఓటమి ఎదురయింది. 1999లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పలమనేరు నుంచి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో మాత్రం ఓడిపోయారు. 2009లో చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు తిప్పే స్వామి. 2014లో మడకశిర రిజర్వుడు నియోజకవర్గం నుంచి తిప్పేస్వామి కి ఛాన్స్ ఇచ్చారు జగన్. కానీ ఆయన ఓటమి చవిచూసారు. అయితే 2018లో కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే అయ్యారు తిప్పేస్వామి. 2019లో అదే మడకశిర నుంచి రెండోసారి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అలాగని వేరే పార్టీలో చేరలేదు. అందుకే తిప్పే స్వామికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!