Tuesday, April 22, 2025

పిఠాపురం పై నాగబాబు ఫుల్ ఫోకస్.. టార్గెట్ వర్మ!

- Advertisement -

పాపం పిఠాపురం వర్మ కు ఎటూ పాలు పోవడం లేదు. నియోజకవర్గంలో సరైన గౌరవం లేదు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ చెబితే కానీ వర్మకు పదవి దక్కే చాన్స్ కనిపించడం లేదు. సంతట్లో సడే మియా అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురంలో పట్టు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. వర్మను మరింత తొక్కిపెట్టేలా తన ప్రయత్నాలను ప్రారంభించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నాగబాబు నేరుగా పిఠాపురం బయలుదేరారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ కూటమి ప్రతినిధిగా వర్మకు మాత్రం ఆహ్వానం లేదట.

ఎమ్మెల్యేల కోట కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు నాగబాబు. సతీ సమేతంగా సీఎం చంద్రబాబును కలిశారు. ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎంను సన్మానించారు కూడా. అటు సీఎం చంద్రబాబు సైతం నాగబాబు దంపతులకు ఆత్మీయ సన్మానం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారో లేదో.. నేరుగా పిఠాపురం వెళ్లేందుకు నాగబాబు సిద్ధపడిపోయారు. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది.

అయితే నాగబాబు సెంటిమెంట్ ప్రకారం పిఠాపురంలో శక్తి పీఠాలను సందర్శిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ప్రభుత్వానికి సంబంధించి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయనతో పాటు జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ సైతం వస్తున్నారు. భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న పిఠాపురంలో టిడిపి ఇన్చార్జిగా ఉన్న వర్మకు మాత్రం ఆహ్వానించకపోవడం సరికొత్త వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తేనె తుట్టను కదిపారు. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక తమ కృషి ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు నాగబాబు. అటువంటి నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి నేరుగా పిఠాపురం వస్తున్నారు. పైగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వర్మ ఆహ్వానం లేకుండా అవమానానికి గురి చేశారు. టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ దయ లేనిదే తనకు పదవి రాదని వర్మకు తెలుసు. అలాగని చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయం చూస్తే ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన వర్మది. ఇటువంటి తరుణంలో జనసేనకు దగ్గర అయ్యేందుకు వర్మ ప్రయత్నిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే నాగబాబు మాత్రం వర్మ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

పిఠాపురం నియోజకవర్గంలో తమకంటూ సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు మెగా బ్రదర్స్. పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత నియోజకవర్గం గా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకు వర్మ అడ్డంకి గా ఉండడంతో.. ఆయనను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి ఎమ్మెల్సీలకు తో పాటు రాజ్యసభ సభ్యులకు నిర్దిష్ట నియోజకవర్గాలు లేవు. కానీ నాగబాబు ఇలా ఎమ్మెల్సీ అయ్యారు.. అలా పిఠాపురం వచ్చేస్తున్నారు. దీంతో ఆయన పిఠాపురంలో పాగా వేసే అవకాశం ఉంది. అదే జరిగితే వర్మకు మున్ముందు మరిన్ని అవమానాలు తప్పవు. ఆయన రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవడం అనివార్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!