Wednesday, March 19, 2025

వైయస్సార్ కాంగ్రెస్ లోకి కేశినేని నాని రీఎంట్రీ

- Advertisement -

విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని మనసు మార్చుకున్నారా? పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారా? తెలుగుదేశం పార్టీతో తాడోపేడో తేల్చుకొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పరామర్శల పేరుతో అందరినీ కలుస్తున్నారు. పాత మిత్రులను తరచూ కలుస్తూ రాజకీయ పరిణామాల గురించి ఆరా తీస్తున్నారు. దీంతో ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరడం కష్టం. ఏకంగా లోకేష్ నాయకత్వాన్ని విభేదించడంతోనే కేశినేని నాని పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అటువంటిది లోకేష్ దయ లేకుండా టిడిపిలో చేరడం అంత ఈజీ కాదు. మరోవైపు టిడిపి నేతలు తీరుతో తీవ్ర అంతర్మధనం చెందుతున్నారు నాని. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే తన సత్తా చాటాలని భావిస్తున్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రీఎంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభం అయింది.

2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు కేసినేని నాని. 2019లో జగన్ ప్రభంజనంలో తట్టుకుని నిలబడ్డారు. రెండోసారి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. అయితే పార్టీలో ఆయనకంటూ సరైన గుర్తింపు దక్కలేదు. ప్రధానంగా లోకేష్ అనుచరులుగా చెప్పుకునే దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్ధ వెంకన్నలు వ్యతిరేకంగా పావులు కదిపేవారు. వారికి లోకేష్ తెర వెనుక సహాయం అందించేవారు. మరోవైపు కేశినేని నానికి వ్యతిరేకంగా ఆయన సోదరుడు శివనాధ్ ను తయారు చేశారు లోకేష్. ఈ పరిణామాలతో కలత చెందిన నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే విజయవాడ ప్రజల కోసం అన్నీ చేసిన తనను ఓడించారన్న బాధతో రాజకీయాలనుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే గత తొమ్మిది నెలలుగా టిడిపి నేతల వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. అందుకే వారికి తన సత్తా చూపాలని కేశినేని నాని స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేసినేని నాని రాజకీయాల్లోకి రాకముందు సేవా కార్యక్రమాలతో విజయవాడ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎంపీగా ఓటమి చవిచూసిన సేవా కార్యక్రమాలు మాత్రం విడిచిపెట్టలేదు. విజయవాడ ప్రజలు అంటే తనకు ఇష్టమని.. వారికోసం ఎంత దాకైనా ముందుకెళ్తానని ఇటీవల ప్రకటించారు నాని. మరోవైపు విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరచూ పర్యటనలు చేస్తున్నారు. శుభకార్యాలకు హాజరవుతున్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శిస్తున్నారు. దీంతో కేసినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ కావడం ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని చూస్తున్నట్లు సమాచారం.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కమ్మ సామాజిక వర్గం ఆలోచన మారుతోంది. ఇప్పటికే సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు జగదీష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించారు. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం సైతం వైయస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ మోహన్ అరెస్టయ్యారు. అబ్బాయి చౌదరి పై కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చి కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసినేని నాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!