గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసిన ఏపీ పోలీసులు కోర్టు ముందు ఉంచారు. న్యాయస్థానం ఏకంగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. గన్నవరం టిడిపి కార్యాలయంలో పనిచేసే సత్య వర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడికి కుటుంబం ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. దీంతో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా.. కక్షపూరితంగా చేసినదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టుపై వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు సంస్కృతి నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కేసులతోపాటు అరెస్టులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయాందోళన గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూటమి వైఫల్యాలపై పోరాడుతామని స్పష్టం చేశారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళనున్నారు. వంశీకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో గన్నవరం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని వంశీ. ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గానికి సైతం దూరమయ్యారు. పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. అయితే గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా ఉండేవారు వల్లభనేని వంశీ. కూటమి అధికారంలోకి రావడంతో తనకు కష్టాలు తప్పవని భావించారు. అందుకే ఎక్కువ శాతం హైదరాబాద్కు పరిమితం అయ్యారు. కొద్దిరోజుల పాటు విదేశాలకు కూడా వెళ్లారు. అయితే కోర్టు కేసుల కోసం అప్పుడప్పుడు గన్నవరం వస్తుండేవారు. ఇప్పటికే గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కానీ అదే కేసుకు సంబంధించి.. టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించగలిగారు.
అయితే వల్లభనేని వంశీ అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మిగతా నేతల విషయంలో సైతం కూటమి ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తుందన్న సంకేతాలు ఉన్నాయి. ఈ తరుణంలో వల్లభనేని వంశీకి అండగా నిలవాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడానికి నిర్ణయించారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది.