కొందరు నేతల వ్యవహార శైలి వింతగా ఉంటుంది. వారి నిర్ణయాలు కూడా వింతగా ఉంటాయి. ప్రాధాన్యత ఇచ్చే పార్టీలను వదిలి వెళ్తుంటారు. వారు తీసుకునే నిర్ణయాల పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. ఆ కోవలోకి చెందుతారు మర్రి రాజశేఖర్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు రాజశేఖర్. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిలకలూరిపేటలో సుదీర్ఘ రాజకీయం చేశారు రాజశేఖర్. కానీ ఎక్కువసార్లు ఆయనకు ఓటమి ఎదురైంది. 2004లో తొలిసారిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు చాన్స్ ఇచ్చారు. కానీ టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మరి రాజశేఖర్. కానీ చివరి నిమిషంలో టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విడదల రజినీకి ఛాన్స్ ఇచ్చారు జగన్. రాజశేఖర్ ను సైడ్ చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఎమ్మెల్సీ ని చేశారు.
2024 ఎన్నికల్లో విడుదల రజినిపై వ్యతిరేకత ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ప్రత్తిపాటి పుల్లారావు టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన మనోహర్ నాయుడు ను బరిలో దించారు. దీంతో మర్రి రాజశేఖర్ కు ఛాన్స్ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఎన్నికల్లో పెద్దగా పని చేయలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ నాయుడు ఓడిపోయారు.
అయితే తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజశేఖర్. కానీ టిడిపిలో చేరే ప్రయత్నాలను అడ్డుకున్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. అయితే పుల్లారావు ఉండగా టిడిపి మర్రి రాజశేఖర్ కు చాన్స్ ఇచ్చే అవకాశం లేదు. అలాగని ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అంటే ఆ అవకాశమే లేదని తెలుస్తోంది. మరి మర్రి రాజశేఖర్ టిడిపిలో ఎందుకు చేరాలని భావిస్తున్నారో తెలియడం లేదు.