జనసేనలో బాలినేని ఒంటరి అయ్యారా? ఆయనను ఆ పార్టీలో పట్టించుకునే వారు లేరా? వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారా? కానీ కౌంటర్ ఇవ్వలేక చేతులెత్తేసారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట జనసేన ప్లీనరీలో మాట్లాడారు మాజీ మంత్రి బాలినేని. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా కౌంటర్ ఎటాక్ చేస్తోంది. కానీ బాలినేనికి మాత్రం జనసేన కనీస స్థాయిలో కూడా మద్దతుగా రావడం లేదు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పగ్గాలనే అప్పగించారు. కీలకమైన పోర్టు పోలియో ఇచ్చారు. ప్రభుత్వంలో ప్రాధాన్యమైన మంత్రిగా గుర్తింపు తీసుకొచ్చారు. కేవలం మంత్రివర్గ విస్తరణలో పదవి పోయిందన్న అసంతృప్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి క్రమేపి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఎందుకో జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అందుకే మొన్నటి జనసేన ప్లేనరీలో పవన్ కళ్యాణ్ కు మించి జగన్మోహన్ రెడ్డి పై కామెంట్ చేశారు. తన ఆస్తులను దోచుకున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. స్థాయికి మించి వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటపెడతానని కూడా హెచ్చరించారు.
అయితే బాలినేని వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్టు ప్రకాశం జిల్లా జనసేన నేతలు ఉన్నారు. జనసేన రాష్ట్ర స్థాయి నేతలు సైతం బాలినేని కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే వైసిపి నేతల కౌంటర్ ఎటాక్ కంటే.. సొంత పార్టీ నేతలు తన కు మద్దతు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలినేని పై వ్యక్తిగత విమర్శల దాడి కొనసాగుతోంది. దురాలవాట్లతో ఆస్తులు పోగొట్టుకొని.. జగన్మోహన్ రెడ్డి పై పడతావా అంటూ నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ప్రశ్నించారు. అది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మింగుటుపడని విషయం. ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే బాలినేని పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేకాట తో పాటు విలాస జీవితానికి అలవాటపడే బాలినేని ఆస్తులు పోగొట్టుకున్నారని.. దానికి జగన్ పై పడిపోతారేంటని ప్రశ్నించారు. విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మూకుమ్మడిగా బాలినేని పై దాడి చేసినంత పని చేశారు. కానీ ఆ స్థాయిలో జనసేన పార్టీ నుంచి బాలినేనికి మద్దతు లభించలేదు. దానినే ఎక్కువగా జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనలో ఒంటరి వాడినైపోయానని బాధపడుతున్నారు. ఏ స్థాయిలో ఉండేవాడిని ఏ స్థాయికి పడిపోయాను అన్న బాధ అనుచరుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే అంటారు చేసుకున్నోడికి చేసినంత మహాదేవా అని. ఈ సామెత అచ్చు గుద్దినట్టు ఇప్పుడు బాలినేనికి సరిపోతుంది.