నెల్లూరు జిల్లాలో మరో కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం కానుందా? అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆ కుటుంబం విభేదిస్తోందా? త్వరలో సైకిల్ ఎక్కడం ఖాయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో పేరు మోసిన కుటుంబాలు రాజకీయాలు నడిపేవి. అటువంటి వారిలో మేకపాటి కుటుంబం ఒకటి. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబానికి ఒంగోలులో కూడా మంచి పేరు ఉంది. ఆ కుటుంబం నుంచి ఎంతోమంది నేతలు తెరపైకి వచ్చారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు, ఒంగోలు, నరసరావుపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కుటుంబంలో మేకపాటి ఒకటి. అటువంటి కుటుంబం పార్టీకి గుడ్ బై చెబుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది మేకపాటి కుటుంబం. ఆత్మకూరు నియోజకవర్గంలో సైతం ఆ కుటుంబం ప్రభావం చూపింది. ఉదయగిరి నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. అటు ఆత్మకూరు నుంచి కుమారుడు గౌతమ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014 ఎన్నికల్లో తొలిసారిగా ఆత్మకూరు నుంచి గెలిచారు గౌతంరెడ్డి. 2019లో రెండోసారి గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే గౌతమ్ రెడ్డి అకాల మరణంతో రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు మేకపాటి కుటుంబ సభ్యులు. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అప్పటినుంచి పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒక పరిణామం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు మంత్రి నారా లోకేష్. అదే వేడుకల్లో పాల్గొన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. నారా లోకేష్ ను చూసి కుర్చీ పైనుంచి లేచి నమస్కరించారు రాజ మోహన్ రెడ్డి. అంతకంటే ముందే లోకేష్ పెద్దాయన వద్దకు వచ్చి నమస్కరించారట. దీంతో రాజమోహన్ రెడ్డి కంగ్రాట్స్ లోకేష్ అంటూ భుజం తట్టి అభినందించారట. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అప్పటినుంచి మేకపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతుందని బలంగా ప్రచారం ప్రారంభం అయ్యింది.
అయితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటిష్ట స్థితిలో ఉంది. బలమైన నేతలు ఆ పార్టీకి ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వంటి నేతలంతా ఉండగా.. ఇప్పుడు వారి సరసన మేకపాటి కుటుంబం చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని విడిచి బయటకు వెళ్లి ఛాన్స్ లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అదంతా ఉత్త ప్రచారమేనని తేల్చేస్తున్నారు. చివరి వరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటారని తెగేసి చెబుతున్నారు