Sunday, March 16, 2025

ఆ ఇద్దరు ఎంపీలతో నలిగిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు!

- Advertisement -

విశాఖలో ఇద్దరు ఎంపీల మధ్య కూటమి ఎమ్మెల్యేలు నలిగి పోతున్నారా? ఆ ఇద్దరి పెత్తనం ఎక్కువవుతోందా? చీటికిమాటికి వారు నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారా? ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులు కావడంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. 15 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 13చోట్ల విజయకేతనం ఎగురవేసింది. విశాఖపట్నం పార్లమెంట్ స్థానంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటును కూడా గెలుచుకుంది. అయితే అనూహ్యంగా అరకులో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో.. అరకు పార్లమెంట్ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటపడింది. అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు లో ఆ ఇద్దరు ఎంపీల పెత్తనం ఎక్కువ అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

విశాఖపట్నం స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ విజయం సాధించారు. ఈయన స్వయాన నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు. మంత్రి నారా లోకేష్ కు తోడల్లుడు. ఆపై మాజీ ఎంపీ, దివంగత నేత ఎంబీబీఎస్ మూర్తి మనుమడు. అయితే నందమూరి, నారా కుటుంబాలతో బంధుత్వం ఉండడంతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. వాస్తవానికి గాజువాక కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా శ్రీనివాస్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయనను సైతం బీట్ అవుట్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. టిడిపి కార్యకలాపాలన్నీ శ్రీ భరత్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. నిన్నటికి నిన్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టిడిపి కూటమి మద్దతు ప్రకటించింది. అయితే ఈ ప్రకటన కూడా ఎంపీ శ్రీ భరత్ చేయడం విశేషం.

విశాఖపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో.. నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు భీమిలి, శృంగవరపుకోట, గాజువాక నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ శ్రీ భరత్ పై ఉంది. ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట తెలుగుదేశం పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలను సైతం లెక్కచేయడం లేదన్న విమర్శ ఉంది.

ఇంకోవైపు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. ఈయన సీఎం చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు. ఆపై బిజెపి పెద్దలతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈయన సైతం తన పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలను సైతం ఈయన ఖాతరు చేయడం లేదట. దీంతో కూటమిలో ఇతనితో ఒక రకమైన డిస్టబెన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయినదానికి కాని దానికి ఫిర్యాదులతో రెచ్చిపోతుంటారని ఈయనపై ఒక అపవాది ఉంది. ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు. దీంతో తన వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచారని ఈయన భావనట. అందుకే ఎవరినీ లెక్క చేయడం లేదట. అటు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ పేరును ప్రముఖంగా వాడుతారట. పైగా కేంద్ర ప్రభుత్వంలో తన పాత్ర పెరిగిందని సొంతంగా చెప్పుకుంటారట. ఇలా విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలతో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు తెగ బాధపడుతున్నారట. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారట. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుతో పాటు లోకేష్ కు కావాల్సిన వారు కావడంతో సైలెంట్ గా ఉంటున్నారట. అయితే ఇది ఇలానే కొనసాగితే మాత్రం మున్ముందు కూటమిలో విభేదాలకు ఈ ఇద్దరు నేతలు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!