మొన్నటి వరకు ఆ నేత జనసేన ను టార్గెట్ చేశారు. పూర్వాశ్రమంలో ఆ పార్టీలో ఉన్నానన్న విషయాన్ని మరిచిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవారు. అయితే ఇప్పుడు ఆ నేతను బిజెపిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండడం పై జనసేన నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేరికను తప్పుపడుతున్నారు. అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కధ? అంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ వాయిస్ను వినిపించిన నేతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేవారు పోతిన మహేష్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వర్గానికి చెందిన ఈ నేతను పవన్ కళ్యాణ్ ఎంతగానో ప్రోత్సహించారు. కాపు సామాజిక వర్గం నేతకావడంతో ఎనలేని ప్రాధాన్యం దక్కేది. ఈయనది పశ్చిమ నియోజకవర్గం అయినా.. విజయవాడ నగర బాధ్యతలు ఈయనే చూసేవారు. అటువంటి నేత ఈ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో కలత చెందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురు కావడంతో పునరాలోచనలో పడ్డారు. సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు ఇప్పుడు భావిస్తున్నారు. త్వరలో ఈయన బిజెపిలో చేరతారని ప్రచారం నడుస్తోంది.
2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు పోతిన మహేష్. గౌరవప్రదమైన ఓట్లు సాధించుకున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జనసేన బలం పెంచే పనిలో పడ్డారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఆ స్థానం దక్కుతుందని.. అది తనకే లభిస్తుందని భావించారు మహేష్. కానీ అనూహ్యంగా పొత్తులో ఈ సీటు బిజెపికి వెళ్లిపోయింది. బిజెపి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. ఈ పరిణామాలను తట్టుకోలేకపోయినా పోతిన మహేష్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇలా చేరి క్రమంలో పవన్ కళ్యాణ్ పై విపరీతమైన విమర్శలు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పవన్ పై విమర్శలు చేయడానికి పోతిన మహేష్ ను ప్రయోగించేది. అయితే ఇప్పుడు అదే మహేష్ బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన పోతిన మహేష్ లాంటి నేతలను ఎలా తీసుకుంటారని బిజెపిని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. అధినేత పై దారుణ విమర్శలు చేసిన నేత విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అయితే పోతిన మహేష్ను బిజెపిలోకి తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో సుజనా చౌదరిపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. ఇలానే కొనసాగితే బిజెపి విషయంలో తాడోపేడో అన్నట్టు సిద్ధమవుతున్నారు జనసేన నేతలు. మరి ఏం జరుగుతుందో చూడాలి