విశాఖ జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకొని కొత్త నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ బాధ్యతలను ఒక యంగ్ స్టార్ కు అప్పగించారు జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ జరుగుతున్న వివాదాలతో పాటు మరికొన్ని స్థానిక సమస్యలపై పోరాడే నేతను తెరపైకి తెచ్చారు. ఎలాగైనా గాజువాక నియోజకవర్గాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాన్ని విడిచి పెట్టుకోకూడదని కంకణం కట్టుకున్నారు. అందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
గాజువాక నియోజకవర్గం అంటే ముందుగా గుర్తొచ్చేది తిప్పల కుటుంబం. సుదీర్ఘకాలం ఆ కుటుంబం గాజువాక నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించేది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిప్పల గురుమూర్తి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు. అటు తరువాత తిప్పల నాగిరెడ్డి సైతం తన సత్తా చాటుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏకంగా పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు నాగిరెడ్డి. కానీ 2024 ఎన్నికల్లో జగన్ ఇక్కడ ప్రయోగం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి యువనేత గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ ప్రయోగం డిజాస్టర్ గా నిలిచింది. ఇక్కడ తిప్పల కుటుంబం అయితే సరిపోతుందని భావించి.. ఆ కుటుంబం నుంచి యువనేతకు చాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.
2024 ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 95 వేల ఓట్ల మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ పై గెలిచి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంచనా తప్పింది. ఆది నుంచి ఈ నియోజకవర్గంలో తిప్పల కుటుంబానికి పట్టు ఉంది. దానిని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. యువకుడు కావడం, ఆపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వెలుగు చూస్తుండడంతో.. ఆ యువనేత గాజువాక నియోజకవర్గం లో దూసుకుపోతున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కూటమి పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూటమి పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు. స్థానికంగా వేలాది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాల్లో ఇది వ్యతిరేకతకు కారణమవుతోంది. దీనిని క్యాస్ట్ చేసుకునే పనిలో పడ్డారు తిప్పల దేవాన్ రెడ్డి.
ఇక్కడ పల్లా శ్రీనివాస్ గెలుపు నకు అనేక కారణాలు దోహదపడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ కాపు సామాజిక వర్గం కూటమికి అండగా నిలబడింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో కాపు సామాజిక వర్గం కూటమికి అండగా నిలిచింది. 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీకి అండగా నిలిచారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. తమ వల్లే పవన్ ఓడిపోయారని తెగ బాధపడింది కాపు సామాజిక వర్గం. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏకపక్షంగా మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో పల్లా శ్రీనివాస్ కాండిడేట్ అయ్యారు. ఆయనకు మద్దతు తెలపడంతోనే భారీ మెజారిటీ సాధ్యపడింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి కాపుల గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. తిప్పల దేవాన్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతూ ఉండడంతో కాపు సామాజిక వర్గం యువత వైసిపి వైపు టర్న్ అవుతోంది. వచ్చే ఎన్నికల వరకు ఇదే దూకుడు కొనసాగితే మాత్రం టిడిపి కూటమికి దెబ్బ పడటం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో