ముద్రగడ సరికొత్త సందిగ్ధంలో పడనున్నారా? ఇంటి పోరు ప్రారంభం కానుందా? పిల్లలిద్దరూ ప్రత్యర్థులుగా మారనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాడు వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిగా కుమారుడు ఉన్నారు. ఇప్పుడు అదే స్థానం నుంచి జనసేన ఇన్చార్జిగా ముద్రగడ కుమార్తెను నియమించనున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు ముద్రగడ పద్మనాభం. అలా ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటారని కూడా సవాల్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు.
అయితే ఆది నుంచి ముద్రగడ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు ఆయన కుమార్తె క్రాంతి. అప్పట్లో జనసేన అధినేత పవన్ పై ముద్రగడ విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు క్రాంతి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు ఇన్చార్జిగా ముద్రగడ కుమారుడిని నియమించారు జగన్మోహన్ రెడ్డి.
అయితే తండ్రితో విభేదించిన ముద్రగడ కుమార్తె క్రాంతి తన భర్తతో కలిసి జనసేనలో చేరారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జిగా క్రాంతి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ప్రత్తిపాడు ఇన్చార్జిగా ఉన్న తమ్మయ్య బాబు ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ వైద్యాధికారి ఒకరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళ అని చూడకుండా దుర్భాషలాడారు. అది పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో తమ్మయ్య బాబు పై వేటు పడింది. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు.
ఉభయగోదావరి జిల్లా కావడం, ఆపై అధికార పార్టీ కావడంతో ప్రతిపాడు జనసేన ఇన్చార్జి పోస్టుకు డిమాండ్ పెరిగింది. చాలామంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ముద్రగడ కుమార్తె క్రాంతికి అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అక్కడ ముద్రగడ కుమారుడు వైసీపీ ఇన్చార్జిగా ఉండడంతో పవన్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. అదే జరిగితే పిల్లలిద్దరి మధ్య ముద్రగడ నలిగిపోవడం ఖాయం.