ఏపీ విషయంలో బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా? కూటమితో పని లేకుండా తనకు తాను మిషన్ అమలు చేస్తుందా? ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. టిడిపి తో పాటు చంద్రబాబు వ్యతిరేకించే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఇది ముమ్మాటికి ఆర్ఎస్ఎస్ స్కెచ్ అని తెలుస్తోంది.
ఏపీలో పట్టు కోసం బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు. అప్పుడెప్పుడో టిడిపి ఆవిర్భావ సమయంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించింది బిజెపి. కానీ ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి ఏపీలో చాన్స్ దొరకలేదు. పొరుగును ఉన్న కర్ణాటకలో ప్రతాపం చూపింది. పక్కనే ఉన్న ఒడిస్సాలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో సైతం ఉనికి చాటుకుంటుంది. కానీ ఏపీలో స్నేహితులు లేనిదే ప్రభావం చూపలేని స్థితిలో బిజెపి ఉంది.
ఏపీలో బిజెపి బలపడకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణమన్నది ఒక విశ్లేషణ. పొత్తులో భాగంగా ఆ పార్టీతో కలిస్తేనే బిజెపి ఉనికి చాటుకునేది. ఒంటరిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావు. పోనీ ఇతర పార్టీలతో జతకడితే కనీస స్థాయిలో కూడా ఓట్లు రావు. అందుకే తెలుగుదేశం పార్టీతో జతకడుతూ వస్తోంది బిజెపి. అయితే ఈ పరిస్థితికి కారణం కూడా టిడిపి అన్నది బిజెపిలో ఉన్న ఒక అనుమానం.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపింది బిజెపి. అయితే టిడిపి తో పొత్తును వ్యతిరేకించే బిజెపి నేతలు చాలామంది ఉన్నారు. అయితే వారందరిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉంది. వాస్తవానికి వారు నికార్సైన బిజెపి నేతలు. దానిని మరిచి టీడీపీతో పొత్తును వ్యతిరేకించారు అన్న ఒకే ఒక కారణంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురుగా ముద్ర వేశారు.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి తరఫున మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కింది. ఈయనపై టిడిపి వ్యతిరేక ముద్ర ఉంది. అయినా సరే ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడం వెనుక ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన ఎంపిక విషయంలో చంద్రబాబు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు సమాచారం. అయినా సరే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు సోము వీర్రాజు.
మరోవైపు ఏపీవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నేతలు ఇప్పుడు పదవులు దక్కించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఏపీ విషయంలో బిజెపి వైఖరి మారడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా జీవీఎల్ నరసింహం కు త్వరలో రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టిడిపి తో పొత్తును వ్యతిరేకించిన నేతల్లో సోము వీర్రాజు తో పాటు జివిఎల్ ఉన్నారు. త్వరలో నరసింహంకు రాజ్యసభ ఇస్తారని తెలుస్తోంది.
అయితే చంద్రబాబుకి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అంతకంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. వచ్చే ఎన్నికల్లో నెగ్గడం ముఖ్యం. అందుకే ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి తలొగ్గుతున్నారు చంద్రబాబు. అవసరం అనుకుంటే ఆర్ఎస్ఎస్ సిఫారసు చేసే ప్రతి నేతకు పదవులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సో చంద్రబాబుకు ఇప్పుడు బిజెపి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి అన్నమాట.