వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు కలిగిన జిల్లా ప్రకాశం. కానీ ఎన్నికల్లో అక్కడ దారుణ పరాజయం ఎదురయింది. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి క్రియాశీలక బాధ్యతలు కట్టబెట్టారు.
ప్రకాశం జిల్లా కు సంబంధించి పెద్ద పెద్ద నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి క్రియాశీలకంగా ఉండేవారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి సైతం కీలక పాత్ర పోషించేవారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచేవారు. ప్రస్తుతం ఈ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేరు.
ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి. దీంతో ఎంపీగా పోటీ చేసేందుకు ప్రత్యామ్నాయ నేత అవసరం. అందుకే చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశానికి తెప్పించారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఓటమి ఎదురయింది. ఫలితాలు వచ్చాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరిపోయారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కూటమి బలంగా ఉంది. అక్కడ పార్టీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు. దర్శి నుంచి గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా పగ్గాలు అప్పగించారు. ఆపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. వై వి సుబ్బారెడ్డి తెరవెనుక సహకారం అందిస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు తర్వాత ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీలా పడడం వాస్తవం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు వారిని తట్టి లేపి పనిలో పడ్డారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
నిన్ననే ఫీజు రియంబర్స్మెంట్ పై ఒంగోలులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అన్ని నియోజకవర్గాల బాధ్యులు హాజరయ్యారు. దీంతో ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయిన పరిస్థితికి వచ్చింది.
2014 ఎన్నికల్లో సైతం ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది. 2019 ఎన్నికల్లో అయితే దాదాపు క్లీన్ స్లీప్ చేసినంత పని చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి త్రయం చక్కగానే పనిచేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఫలితాలు కూడా వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..