ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెస్ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పెద్దగా కనిపించింది లేదు. కానీ నిన్న జరిగిన ఫీజు పోరు బాటలో ఆయన కనిపించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్టీలో తిరిగి క్రియాశీలకం కావడం ఖాయమని తేలిపోయింది.
నందికొట్కూరు నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో అనధికారికంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే. ఆయన బొట్టు పెట్టిన వారే అక్కడ శాసనసభ్యుడు. కానీ 2024 ఎన్నికల్లో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొంత డీలా పడ్డారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడడంతో వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టేందుకు సిద్ధపడుతున్నారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి యూత్ లీడర్ కూడా. సోషల్ మీడియాలో సైతం ఎనలేని క్రేజ్ ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాప్ చైర్మన్గా సైతం నియమించబడ్డారు. అయితే గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన పడ్డాయి. ఇప్పుడు తిరిగి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెనక్కి తగ్గుతారని.. భయపడి పోతారని ప్రచారం నడిచింది. కానీ అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. నిన్న పోరు బాటలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్ గా పని చేయడంతో రాజకీయ ప్రత్యర్థుల సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నుంచి పదునైన మాటలు రావడంతో ఇబ్బందికరమే అని ఒక అంచనాకు వచ్చారు.