నాగబాబుకు ఇప్పట్లో మంత్రి పదవి లేదని తెలుస్తోంది. మరో ఏడాదిన్నర వరకు ఆయన ఆగాల్సిందేనని సమాచారం. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నాగబాబు. ఉగాదికి మంత్రిగా ప్రమాణం చేస్తారని కూడా అంతా భావించారు. కానీ ఇప్పట్లో నాగబాబుకు అమాత్య పదవి దక్కే ఛాన్స్ లేదని సమాచారం.
నాగబాబును మంత్రిని చేస్తే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జనసేన ప్లేనరీలో నాగబాబు చేసిన కామెంట్స్ పట్ల టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. అదే విషయాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం.
వాస్తవానికి నాగబాబు కు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అనే ప్రచారం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపుకుంటారని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పటికే మంత్రిగా అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కార్పొరేషన్ పదవి ఇస్తే సీఎం మాటకు విలువ లేకుండా పోతుంది. అందుకే ఎమ్మెల్సీ పదవి ఇస్తే మంత్రి పదవి ఇస్తారని ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. అలాగని నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే టిడిపిలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అవుతుంది.
ఎమ్మెల్సీ పదవుల కోసం టిడిపిలో నేతలు పడిగాపులు కాస్తున్నారు. దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, వంగవీటి రాధాకృష్ణ, బుద్ధ వెంకన్న లాంటి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిని కాదని నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఇదే ఊపులో మంత్రి పదవి ఇస్తే అసలు వస్తుందని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. అందుకే మంత్రి పదవి కాస్త చల్లబడిన తర్వాత ఇస్తామన్న నిర్ణయానికి వచ్చారు.
మూడేళ్లు అయితే కానీ మంత్రివర్గ విస్తరణ జరగదు. జరపలేరు కూడా. కొత్తగా ఎన్నికైన పదిమందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినప్పుడే పదవులు తొలగింపు ఉంటుందని కూడా తేల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు కొంతమంది సీనియర్లకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు విస్తరణ ఉంటుందన్నమాట. ఇప్పుడు నాగబాబు కూడా ఆ విస్తరణ వరకు ఆగాల్సిందేనని తేల్చి చెప్పారన్నమాట. సో నాగబాబు మంత్రిగా ఇప్పట్లో అయ్యే అవకాశం లేదన్నమాట.