రామానాయుడు స్టూడియో భూములపై కూటమి ప్రభుత్వం కన్నేసిందా? ఆ భూములను వెనక్కి తీసుకోవాలని చూస్తుందా? లేకుంటే రామానాయుడు కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తోందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాము చేస్తే లోక కళ్యాణం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంది తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహార శైలి. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామానాయుడు స్టూడియో భూములను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు టిడిపి నేతలు. ఇప్పుడు అదే టిడిపి నేతలు మిగులు భూములు గురించి మాట్లాడుతున్నారు.
నిన్ననే శాసనసభలో మాట్లాడారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. రామానాయుడు స్టూడియో కు ప్రభుత్వం కేటాయించిన భూమిలో 15 ఎకరాలు మిగులు భూమిగా ఉందని.. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరడం సంచలనం కలిగిస్తోంది. అదే భూములు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విల్లాల ఏర్పాటుకు అనుమతించారంటూ తెలుగుదేశం పార్టీ నానా హడావిడి చేసింది. ఒకసారి ఇచ్చిన భూములను ఎలా వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించింది. ఇప్పుడు అదే టిడిపి నేతలు అదే భూములను వెనక్కి తీసుకోవాలని సూచిస్తుండడం దేనికి సంకేతం.
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న తలంపుతో స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కు ప్రభుత్వం 35 ఎకరాల భూమిని కట్టబెట్టింది. రుసికొండకు సమీపంలో ఓ కొండపై ఈ భూములను కేటాయించింది. 20 ఎకరాల్లో స్టూడియోలు కట్టారు. ఆపై కొండపై రహదారుల నిర్మించారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సినిమాల షూటింగ్ లు జరగడం లేదు. దీంతో ఆ భూములు వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తూనే ఉంది.
వాస్తవానికి రామానాయుడుకు ఆ భూములు కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం. రామానాయుడు 1999లో టిడిపి తరఫున బాపట్ల నుంచి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలోనే విశాఖలో స్టూడియో కడతానంటూ ముందుకు వచ్చారు. దీంతో అప్పటి చంద్రబాబు సర్కార్ 35 ఎకరాలను కేటాయించింది. కానీ స్టూడియో నిర్మాణం అయితే జరిగింది కానీ.. సినిమా షూటింగ్ లు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. అయితే ఎప్పటికైనా విశాఖ చిత్ర పరిశ్రమకు అనుకూలమని చెప్పి ఆ భూములను రామానాయుడు స్టూడియో కు వదిలేశారు.
అయితే తాజాగా టిడిపి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. రామానాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగా ఉంటుంది. అయినా సరే ఇప్పుడు రామానాయుడు స్టూడియో భూములను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వెనుక.. ఆ కుటుంబాన్ని భయపెట్టాలన్న ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమిషన్ల కోసమే ఈ కొత్త ఎత్తుగడ అని టాక్ వినిపిస్తోంది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ భూములను కబ్జా చేసేందుకు నేతలు ప్రయత్నించారని టిడిపి నేతలు ఆరోపించారు. రామానాయుడు స్టూడియో కు ఆ భూములను కొనసాగించాలని కోరారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ భూములు వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో తెర వెనుక కమిషన్ల దందా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.