జగన్ నా ఆస్తిని కొల్లగొట్టారు.. నా ఆస్తిని బలవంతంగా లాక్కున్నారు. ఈ మాట అన్నది ఎవరో తెలుసా ఒకప్పటి జగన్ సన్నిహితుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అప్పటినుంచి కౌంటర్ ఎటాక్ ప్రారంభమైంది బాలినేని పై. రెండున్నర దశాబ్దాలుగా బాలినేని దోచుకున్న దోపిడీ.. అవినీతిని బయటపెడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయ బిక్ష పెట్టిన రాజన్న కుటుంబం పైనే అబాండాలు మోపిటంత స్థితికి చేరుకున్నారు బాలినేని.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగు గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. అటు తర్వాత కుమారుడు కూడా శీనన్న అంటూ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆ కుటుంబం పైనే ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు బాలినేని. అసలు విలువ లేని కూటమి ప్రభుత్వంలో ఉండి.. లెక్కచేయని జనసేన పార్టీలో ఉండి బాలినేని చేస్తున్న ఈ ఆరోపణల వెనుక ఆయన అవినీతి ఉందన్నది ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుసు.
ప్రకాశం జిల్లాలో ప్రతి నిర్మాణంలోనూ బాలినేని అవినీతి దాగి ఉంది. అసలు ఆయన జనసేనలో చేరింది పదవులకు ఆశించి కాదు. తన అవినీతి సంపాదన.. అక్రమాలపై ఎటువంటి విచారణ జరగకుండా ఉండాలని. ముఖ్యంగా ఓ అత్యాధునిక విల్లాల నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. దీనిపై అప్పట్లో టిడిపి సంచలన ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన సైతం ఇదే అవినీతిని ప్రశ్నించారు. కానీ బాలినేని జనసేనలో చేరిన తర్వాత జనార్ధన సైలెంట్ అయ్యారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి సకుటుంబ సపరివారంగా వందల కోట్లు దోచేశారన్నది ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రధాన ఆరోపణ. ఆయన అవినీతి సంపాదన వేలకోట్ల రూపాయలుగా అప్పట్లో టిడిపి ఆరోపించింది. ఒకానొక సమయంలో ఓ కారులో బాలినేని హవాలా సొమ్ము ఐదు కోట్ల రూపాయలు దొరికింది. కానీ ఆయన అప్పట్లో అధికార పార్టీలో ఉండడంతో సేఫ్ జోన్ లో నిలబడ్డారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు అధికం. కానీ ప్రతి ఫ్యాక్టరీ నుంచి అప్పటి మంత్రి బాలినేని కి ముడుపులు అందేవి. ప్రతి లారీకి ఎంతని వసూలు చేసేవారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రానైట్ డంపింగ్ యార్డుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది కూడా ఒక ఆరోపణ.
ప్రకాశం జిల్లాలో పర్చూరు, చీరాల, ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గం లో ఇసుకను కూడా వదిలి పెట్టకుండా అక్రమ రవాణా చేయించుకున్నారు బాలినేని. ఈ మొత్తం వ్యవహారంలో 100 కోట్ల వరకు కొల్లగొట్టారు అన్నది ప్రధాన ఆరోపణ. కొండపి నియోజకవర్గం లోని కొనిజేడు, ఎర్ర చర్ల ప్రాంతాల్లో 40 కోట్ల విలువైన గ్రానైట్ నిక్షేపాలను అమ్ముకున్నారు. ఒక్క గనుల శాఖ పరిధిలోనే బాలినేని వసూళ్ల పర్వం 1000 కోట్లు అని తెలుస్తోంది.
బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, ఆయన అనుచరుల భూదాహం అంతా ఇంతా కాదు. భూ కబ్జాల్లో అప్పటి మంత్రిగా ఉంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అప్పటి విపక్షం టిడిపి కూడా ఆరోపణలు చేసింది. ఒంగోలు నగరంలో రంగుల ఫ్యాక్టరీ వద్ద 4 ఎకరాలు, మంగమూరు డొంకలో ఆరు ఎకరాలు, వుడ్ కాంప్లెక్స్ వద్ద మూడెకరాలతో పాటు డీకే పట్టాల రూపంలో ఉన్న భూమిని కూడా పెద్ద ఎత్తున బాలినేని అనుచరులు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సకుటుంబంగా దోచుకున్న మంత్రిగా బాలినేని చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఇన్ని రకాల ఆరోపణలు చేసిన టిడిపి గొంతు ఇప్పుడు మూగబోయింది. అంటే బాలినేని తన అవినీతి సంపాదన విషయంలో జాగ్రత్త పడేందుకే జనసేన ను ఆశ్రయించారని అర్థమవుతోంది. కానీ ఆయన వ్యవహార శైలి దొంగే దొంగ అన్నట్టు ఉంది.