రాజమండ్రిలో రెడ్బుక్ రివర్స్ అవుతోందా? తిరిగి టిడిపికే చుట్టుకుంటుందా? ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారిటీతో గెలిచారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ పై దాదాపు 72 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే గత తొమ్మిది నెలలుగా మార్గాని భరత్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కానీ… సక్సెస్ కాలేకపోయారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
ఈ ఎన్నికల్లో మార్గాని భరత్ ఓటమికి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. ముఖ్యంగా 25 శాతం కమిషన్లు, భూదందా ఆరోపణలు, ఇసుక దందా వంటివి భరత్ ఓటమి కి పనిచేసాయి. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు భరత్. కానీ ఆయన ఎక్కువగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పైనే దృష్టి పెట్టారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే గా ఉన్న ఆదిరెడ్డి కుటుంబం వర్సెస్ భరత్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది.
ఆదిరెడ్డి కుటుంబానికి టిడిపి సీనియర్ నేత ఎర్రం నాయుడు కుటుంబంతో బంధుత్వం ఉంది. ఎర్రం నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసు. 2019 ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి గెలిచారు ఎర్రం నాయుడు కుమార్తె భవాని. దీంతో సిటీ నియోజకవర్గపై పూర్తి పట్టు సాధించారు అప్పటి ఎంపీ భరత్. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆదిరెడ్డి కుటుంబంతో వైరం కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆది రెడ్డి వాసును జైలుకు పంపించడం వెనుక భరత్ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అందుకే ఎలాగైనా మార్గాని భరత్ ను జైలుకు పంపించాలన్నది ఆదిరెడ్డి వాసు వ్యూహం.
తప్పకుండా రాజమండ్రిలో రెడ్బుక్ ఓపెన్ చేస్తామని.. మార్గాని భరత్ జైలుకెళ్లడం ఖాయమని సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రధానంగా దేవి చౌక్ వద్ద ఉన్న ఓ సూపర్ మార్కెట్ ప్లీజ్ వ్యవహారంలో ఐదు కోట్ల రూపాయలను మార్గాని భరత్ తీసుకున్నారన్నది ఆదిరెడ్డి వాసు ఆరోపణ. దీనిపై కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సహకార శాఖ మంత్రి అచ్చెననాయుడుకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తద్వారా భరత్ ను జైలుకు పంపించవచ్చని భావించారు. కానీ అందుకు తగ్గట్టు ఆధారాలు లేకపోవడంతో భరత్ అరెస్ట్ జరగలేదని తెలుస్తోంది.
గత తొమ్మిది నెలలుగా భరత్ పై పట్టు బిగించాలని ఆదిరెడ్డి వాసు భావిస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నది వాసు వ్యూహం. ఇసుకతో పాటు గత ప్రభుత్వ హయాంలో అవినీతిని బయటకు తీసి భరత్ పై స్ట్రాంగ్ కేసులు నమోదు చేయాలని చూశారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు.
అయితే తాజాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పై రెడ్ బుక్కు రివర్స్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ స్థలం లేదు విషయంలో భరత్ కు 5 కోట్ల రూపాయలు కమిషన్ దక్కిందని వాసు ఆరోపణలు చేశారో.. అదే స్థలంలో ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి. లీజు దక్కించుకున్న సంస్థ నిర్మాణాలు జరుపుతోంది. ఇందులో వాసుకు భారీగా కమిషన్ వచ్చింది అన్నది భరత్ నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణ పెరుగుతోంది.
మరోవైపు ఆదిరెడ్డి కుటుంబం ప్రారంభంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు. ఎర్రంనాయుడుతో బంధుత్వం ఏర్పడిన తరువాత టిడిపిలో చేరింది ఆ కుటుంబం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు ఆదిరెడ్డి వాసు జక్కంపూడి కుటుంబంతో కలిసి దందాకు దిగారు అన్నది మార్గాని భరత్ వర్గం నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అప్పట్లో భారీగా భూములు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తెరపైకి తెస్తున్నారు మార్గాని భరత్. దీంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రెడ్బుక్ రివర్స్ అవడంతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యింది. మొత్తానికైతే రాజమండ్రిలో రాజకీయం రివర్స్ కావడంతో టిడిపి ఒక్కసారిగా షాక్ కు గురైంది.