తెలుగుదేశం పార్టీలో ఆయనది సుదీర్ఘ చరిత్ర. చంద్రబాబు కంటే టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ కష్టకాలంలో కూడా అండగా నిలబడిన వ్యక్తి. చంద్రబాబు ఉన్నతికి కూడా పాటుపడ్డారు. అటువంటి నేతకు ఇప్పుడు కనీస మర్యాద కూడా దక్కడం లేదు. కనీసం తన వయసును కూడా గౌరవించడం లేదు. గౌరవప్రదమైన పదవీ విరమణ కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? అంటే వాచ్ దిస్ స్టోరీ.
తెలుగుదేశం పార్టీ అంటేనే గుర్తుకొచ్చే పేర్లు చాలానే ఉంటాయి. చంద్రబాబు తరువాతే ఎవరూ అంటే అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కింజరాపు ఎర్రం నాయుడు.. ఇలా చాలామంది నేతల పేర్లు వినిపిస్తాయి. అయితే అందరికంటే స్పెషల్ మాత్రం యనమల రామకృష్ణుడు. చంద్రబాబు ఇంతటి ఉన్నతికి కారణం కూడా ఆయనే. స్పీకర్ గా ఆయన నాడు చంద్రబాబుకు మద్దతు తెలపకపోతే ఆయన సీఎం అయ్యే వారే కాదు. ఇంతటి రాజకీయ ఉన్నతిని సాధించేవారు కాదు.
1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎన్టీఆర్ పిలుపుమేరకు టిడిపిలో చేరారు యనమల రామకృష్ణుడు. ఆ సమయంలో చంద్రబాబు టిడిపిలో లేరు. కానీ టిడిపి గెలిచిన ప్రతిసారి యనమల రామకృష్ణుడు కు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1994 లో మాత్రం యనమలను స్పీకర్ చేశారు ఎన్టీ రామారావు. అదే ఆయన పాలిట శాపంగా మారింది. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారు యనమల. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావును మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు యనమల. అంతలా చంద్రబాబుకు ఫేవర్ చేశారు. అయితే అదే ఫేవర్ చంద్రబాబు సైతం యనమలకు కొనసాగిస్తూ వచ్చారు. అత్యంత ప్రాధాన్యమిస్తూ పదవులు అందిస్తూ వచ్చారు. కానీ లోకేష్ పార్టీలో పట్టు బిగించిన తర్వాత యనమల ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
1983 నుంచి 1999 వరకు తుని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు యనమల రామకృష్ణుడు. కానీ 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో యనమలకు పట్టు చిక్కలేదు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె దివ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మరోసారి రెన్యువల్ చేసి మంత్రిని చేస్తారని అంతా భావించారు. ఎమ్మెల్సీ గా రెన్యువల్ చేయలేదు. మంత్రి పదవి ఇవ్వలేదు. కనీసం ఆయనకు గౌరవం లభించడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు యనమల రామకృష్ణుడు. చంద్రబాబు కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచానన్న అపవాదును ఎదుర్కొన్నానని.. కానీ తన విషయంలో చంద్రబాబు ఆ స్థాయిలో కృతజ్ఞత చూపించడం లేదన్న ఆవేదన యనమల రామకృష్ణుడు లో ఉంది.
రాజ్యసభ పదవి ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలని యనమల భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. బీసీ కోటాలో తనకు ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ దీనిని లోకేష్ అడ్డుకున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన సానా సతీష్ కు అవకాశం ఇచ్చారు. అది కూడా లోకేష్ చరవతోనే. అయితే లోకేష్ ప్రాబల్యం పెరిగిన నేపథ్యంలో తనలాంటి సీనియర్ కు ఇక అవకాశం లేదని యనమల భావిస్తున్నారు. అందుకే ఆయన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ రిటైర్మెంట్ అయినా.. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక అయిన జరగనుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇక్కడ అవసరాలు మాత్రమే పనిచేస్తాయి. దీనికి యనమల రామకృష్ణుడు అతీతం కాదు.