కూటమి ప్రభుత్వంపై మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో ఉన్నారు. పాలిచ్చిన ఆవును వదులుకున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కృతజ్ఞతా భావం చాటుతున్నారు. అందుకు తమకు తగిన శాస్తి జరగాల్సిందేనని బాధపడుతున్నారు. చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పై ఎక్కువమంది మహిళలు అసంతృప్తితో ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని ఎక్కువమంది మహిళలు విశ్వసించారు. తక్షణం అమలు చేస్తారని భావించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న పథకం ఊసు లేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప పథకం మాత్రం కార్యరూపం దాల్చలేదు.
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ హామీని కాపీ కొట్టారు. ఏపీలో అప్లై చేసి సక్సెస్ అయ్యారు. మహిళల ఓట్లను కొల్లగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. తొలుత సంక్రాంతి అన్నారు. తరువాత ఉగాది అని చెప్పుకొచ్చారు.. తీరా ఉగాది సమీపించాక మరో తేదీ అంటూ కొత్త లీకులు ఇస్తున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. మేనిఫెస్టోలో సైతం చేర్చింది. దీంతో అక్కడ మహిళలు విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాదిరిగానే పథకాన్ని అమలు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ప్రకటన చేసింది. ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అక్కడ మహిళలు కూడా విశ్వసించారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తెచ్చారు. దీంతో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేవంత్ సర్కార్ అక్కడ పథకాన్ని అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుంది.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ చేర్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ హామీని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఒకసారి మంత్రులతో సబ్ కమిటీ అంటారు. మరోసారి అధికారులతో రివ్యూలు జరుపుతారు. కానీ పథకం అమలు చేయరు. అందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ అంటూ ఏదీ లేదు. ఏడాదిగా ప్రకటనలతోనే ముందుకెళ్తున్నారు. ప్రయాణాన్ని పక్కన పెట్టి ప్రకటనలతో సంతృప్తి పడాలని మహిళలకు సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు హామీకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంపై ఆశలు కూడా వదులుకుంటున్నారు.