మెగా బ్రదర్ నాగబాబు కు మంత్రిగా చాన్స్ లేదా? చివరి నిమిషంలో ఆయన పేరు తప్పించనున్నారా? ఇది వ్యూహమా? వ్యూహంలో భాగమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న జనసేన ప్లీనరీలో ఎమ్మెల్సీ నాగబాబు అన్నారే కానీ.. కాబోయే మంత్రి అని ఒకరు చెప్పకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సామాజిక సమతూకంలో భాగంగా చివరి నిమిషంలో నాగబాబు స్థానంలో ఓ బీసీ నేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తాజాగా ప్రచారం ప్రారంభమైంది.
జనసేన అంటే కాపుల పార్టీగా ముద్ర పడింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీలో కాపులకు అత్యంత ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కులం చూడం.. మతం చూడం అంటూ చెబుతుంటారని.. కానీ ఆయన కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది. అయితే ఈ చర్చ భవిష్యత్తులో ఇబ్బంది తెచ్చి పెడుతుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మరో మంత్రి పదవి జనసేనకు ఇస్తే బీసీలకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం క్యాబినెట్లో జనసేనకు మూడు మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. మరో మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. పవన్ తో పాటు దుర్గేష్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. మరోవైపు నాదెండ్ల మనోహర్ సైతం ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. నాగబాబును ఇప్పుడు మంత్రిగా తీసుకుంటే కాపు సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు ఇచ్చినట్లు అవుతాయి. అదే జరిగితే పార్టీలో ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది.
అయితే టిడిపి చర్యలను గమనించి జనసేన స్ట్రాటజీ మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మూడు పదవులు దక్కాయి. అందులో రెండు పదవులను బీసీలకు అప్పగించింది టిడిపి. మరో పదవి ఎస్సీ మహిళకు ఇచ్చింది. తద్వారా సామాజిక సమీకరణను తెరపైకి తెచ్చింది. పరోక్షంగా జనసేనకు గట్టి సంకేతాలను పంపింది.
నాగబాబు విషయంలో పవన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జనసేనకు దక్కిన తొలి ఎమ్మెల్సీ పదవిని కాపులకు కేటాయించారు. ఇప్పుడు తాజాగా భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా నాగబాబుకు ఇవ్వడం ద్వారా మరోసారి కాపులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో జనసేన అంటేనే కాపుల పార్టీ అని ప్రత్యర్థులు ప్రచారం చేసేలా వస్త్రాన్ని అందించారు. దానికి చెక్ చెప్పాలంటే మంత్రి పదవి బీసీలకు ఇవ్వాలని చివరిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ అయిన నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. కానీ జనసేనకు మంత్రి పదవి దక్కితే ఆ పదవి బీసీ నేత అయిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సైతం ఆమోదముద్ర వేశారని.. నాగబాబు స్థానంలో కొణతాలకు తీసుకోవాలని సూచించారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.