తాము చేస్తే ఒప్పు.. ఎదుటి వారు చేస్తే తప్పు అన్నట్టు ఉంది టిడిపి కూటమి ప్రభుత్వ పరిస్థితి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు నోటి నుంచి దొంగలు అన్నమాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విమర్శలకు దారితీస్తోంది. సహచర ఎమ్మెల్యేలు అని చూడకుండా.. ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దొంగలు అని సంబోధించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా సమావేశాలకు వెళ్లడం లేదు. మొన్నటి బడ్జెట్ సమావేశాలకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపటికి బయటకు వచ్చారు.
అయితే తాజాగా ఏడుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ రిజిస్టర్లో సంతకాలు పెట్టారని.. తరువాత సభలో వారు కనిపించలేదని.. దొంగల్లా వచ్చి దొంగలా వెళ్లిపోయారంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడం ధూమారం రేపుతోంది. జీతాల కోసమే వారు అలా చేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు అయ్యన్నపాత్రుడు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సమావేశాలను బహిష్కరించారు. దానిని ధిక్కరించి ఆ ఏడుగురు రిజిస్టర్లో సంతకాలు చేయడం తప్పే. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శాసనసభ సమావేశాలను బహిష్కరించలేదా? ఆయన జీతభత్యాలు తీసుకోలేదా? తీసుకుంటే మాత్రం అది ముమ్మాటికీ తప్పు.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. అప్పట్లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కారణం చూపుతూ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. నాడు మూడేళ్ల పాటు సభకు హాజరు కాకపోయినా ఎటువంటి వేటుపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం 60 రోజుల హాజరు నిబంధన తెరపైకి తేవడం దేనికి సంకేతం.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తెగ బాధపడ్డారు. మళ్లీ సీఎం గానే హౌస్ లో అడుగు పెడతానని శపధం చేశారు. అలా చాలా రోజులు పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఆయనపై అప్పట్లో వేటుపడిందా? వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసిందా?
కానీ ఇప్పుడు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ కుట్ర జరుగుతోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వారు సభలకు హాజరు కావడం లేదు. కానీ రిజిస్టర్లు సంతకాలు పెట్టారంటూ వారిని దొంగలతో స్పీకర్ అయ్యన్న పోల్చడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆయన మాదిరిగానే వారంతా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. రాజకీయ కారణాలతో సభకు హాజరు కావడం లేదు. అంతమాత్రాన దొంగలతో పోల్చడం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది ముమ్మాటికి తప్పిదమని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు అలా అనడం సరికాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.