తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి తరచు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. సీఎం చంద్రబాబు పిలిచి మందలించడం పరిపాటిగా మారింది. ఒకసారి టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుట కూడా హాజరయ్యారు. అయినా సరే ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదు. దీంతో టీడీపీకి ఇదో ఇబ్బందికర అంశంగా మారింది. తాజాగా ఆయనపై జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి ఉద్యమ నేపథ్యం ఉండడంతో కొలికపూడి శ్రీనివాసరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడేవారు. టీవీ డిబేట్లో పాల్గొని గట్టి వాయిస్ వినిపించేవారు. ఈ క్రమంలోనే ఆయన ఓ బిజెపి నేతపై డిబేట్లోనే చెప్పుతో కొట్టి సంచలనం రేకెత్తించారు. అయితే తరచూ అటువంటి వివాదాలే చుట్టుముట్టాయి ఆయనకు.
అప్పట్లో టిడిపి అనుకూల మీడియా డిబేట్లో శ్రీనివాసరావు తరచు కనిపించేవారు. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించే వారు. ఈ ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గం తిరువూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు శ్రీనివాసరావు. గెలిచిన నాటి నుంచి అనేక వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా స్థానిక టిడిపి నాయకులతో ఆయనకు పొసగదు. దీంతో వారే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. పావులు కదిపారు. వివాదాస్పదుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కమ్మ సామాజిక వర్గం నేతలతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. పైగా టిడిపి అనుకూల మీడియాతో ఆయన గొడవ పెట్టుకున్నారు. దీంతో తరచూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనను టిడిపి నుంచి బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. కోలికపూడి అవినీతిపరుడు అంటూ ఆరోపించారు. ఆయన అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద రెండు లక్షల రూపాయలు వసూలు చేశారని.. విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆరు లక్షల చొప్పున కలెక్షన్లు చేశారని.. ఇసుకతో పాటు మద్యం సిండికేట్లనుంచి భారీగా దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు.
అయితే కొలికపూడి వ్యవహార శైలి చూస్తుంటే.. ఆయనపై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే మాత్రం టిడిపి నుంచి ఆయన బయటకు వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఒకవైపు, టిడిపి అనుకూల మీడియా మరోవైపు ఆయనను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చర్యలతో విసిగి వేసారి పోయిన కోలికపూడి టిడిపి నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరం అయితే తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తానని కూడా అనుచరుల వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే టిడిపికి ఒక కుదుపే.