ఉత్తరాంధ్ర పై వైసీపీ ఫోకస్ పెట్టిందా? పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోందా? బలమైన నేతకు బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారా? ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా కొత్త నేత నియామకం కానుందా? ఈనెల 12న క్లారిటీ రానుందా? ఉత్తరాంధ్ర సమన్వయ కర్త పేరును ప్రకటించనున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చగా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసింది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. శ్రీకాకుళం తో పాటు విజయనగరం జిల్లాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. విశాఖలో మాత్రం రెండు స్థానాల్లో విజయం సాధించింది.
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో మెరుగైన స్థానాలు సాధించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకుగాను వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నేతకు ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉండేవారు. కానీ ఆయన అనూహ్యంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కొత్త నేతకు సమన్వయ బాధ్యతలు అప్పగించడం అనివార్యంగా మారింది. ఈ తరుణంలో సమర్థవంతమైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషించారు. చివరకు కృష్ణా జిల్లాకు చెందిన మాజీమంత్రి పేర్ని నాని పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ఒకరికి సమన్వయ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావించారు. తొలుత ధర్మాన ప్రసాదరావు పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్. పైగా సుదీర్ఘకాలం మంత్రిగా సేవలందించారు. ఆయన అయితే సరిపోతారని జగన్ మోహన్ రెడ్డి భావించారు. కానీ ధర్మాన ప్రసాదరావు పార్టీలో యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఈ తరుణంలో ఆయన సోదరుడు కృష్ణదాస్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఆయన మూడు జిల్లాల ను లీడ్ చేసే పొజిషన్లో లేరని తెలుస్తోంది. అందుకే ఆయన పేరు సైతం పక్కకు వెళ్లిపోయినట్లు సమాచారం.
మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది. ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. వైసీపీ హయాంలో మంత్రివర్గ విస్తరణలో అమర్నాథ్కు చాన్స్ ఇచ్చారు జగన్. ఈ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అమర్నాథ్ టికెట్ విషయంలో తేల్చలేదు. చివర్లో గాజువాక అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దారుణ పరాజయం ఎదురయింది అమర్నాథ్ కు. ప్రస్తుతం విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అమర్నాథ్. ఇటీవల మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అయితే ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ముందంజలో ఉండే అమర్నాథ్.. పార్టీ శ్రేణులను కలుపు కెల్లరన్న విమర్శ ఉంది. అందుకే ఆయన పేరు సైతం పక్కకు తప్పింది.
మరోవైపు బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రస్తుతం శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్నారు బొత్స. ఆపై గోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు బొత్స. అనూహ్యంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని ఆకాంక్ష ఉంది. కానీ బొత్స కు ఉభయగోదావరి జిల్లాల బాధ్యతను అప్పగించారు జగన్. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ పదవి తనకు అప్పగిస్తారని అంచనా వేశారు. కానీ బొత్సను పిలిపించుకున్న జగన్ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేశారు. ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలను పేర్ని నానికి అప్పగిస్తున్నట్లు బొత్సకు వివరించారు. అందుకు సంబంధించి సమీకరణలను వివరించే ప్రయత్నం చేశారు. దీంతో బొత్స మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశం జరగనుంది. అందులో పేర్ని నాని పేరు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.