తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. వైసీపీని లేకుండా చేయాలన్న ధ్యేయంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపై కూడా విరుచుకుపడుతోంది. వైసిపి నేతలు, ఆ పార్టీ మద్దతు దారులు, సానుభూతిపరులు అనేవారు ఉండకూడదు అన్న ధోరణితో ఉంది టిడిపి సోషల్ మీడియా. ఈ క్రమంలో తమ అధిమాతానికి భిన్నంగా వ్యవహరిస్తే సొంత పార్టీ నేతలని కూడా చూడమని హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలామంది టిడిపి నేతలు అదే పార్టీకి చెందిన సోషల్ మీడియాకు బాధితులుగా మారారు. వరుసగా రాష్ట్రవ్యాప్తంగా నేతలు బాధిత వర్గాలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
సర్దార్ గౌతు లచ్చన్న. బడుగు బలహీన వర్గాల నాయకుడు. ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. అంతకుమించి స్వాతంత్ర సమరయోధుడు కూడా. బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. అటువంటి నేత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది శ్రీసైన గౌడ సంఘం. కృష్ణాజిల్లాలో జరిగిన విగ్రహ ఆవిష్కరణకు రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానాలు అందాయి. గౌడ సామాజిక వర్గానికి చెందిన వైసిపి మాజీమంత్రి జోగి రమేష్ ను కూడా నిర్వాహకులు ఆహ్వానించారు. అయితే అదే కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే, గౌతు లచ్చన్న మనుమరాలు గౌతు శిరీష హాజరయ్యారు. అయితే అది సామాజిక కార్యక్రమం కావడంతో వారితో పాటు వేదిక పంచుకున్నారు జోగి రమేష్. దీంతో టీడీపీ సోషల్ మీడియా విష ప్రచారం ప్రారంభించింది. మంత్రి పార్థసారధితో పాటు మహిళా నేత అని చూడకుండా గౌతు శిరీష కు వ్యతిరేకంగా విషం చిమ్మె ప్రయత్నం జరిగింది.
మొన్న ఆ మధ్యన శ్రీకాకుళంలో సూర్యనారాయణ స్వామి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. భారీ ఈవెంట్ లతో అదరగొట్టారు. ఓ ఈవెంట్ కు హాజరయ్యారు సినీ నేపథ్య గాయని మంగ్లీ. ఈ క్రమంలో అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా వచ్చారు. సహజంగానే సెలబ్రిటీ కావడంతో ఆలయ వర్గాలు మంగ్లీని ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా ఆమె పూజల్లో పాల్గొన్నారు. అది మొదలు తెలుగుదేశం సోషల్ మీడియా రామ్మోహన్ నాయుడు ను టార్గెట్ చేసుకుంది. వైసీపీకి పాటలు పాడిన మంగ్లీ కి దైవదర్శనం కల్పిస్తారా అంటూ నిలదీసినంత పని చేసింది. తెలుగుదేశం పార్టీ కోరితే పాటలు పాడని మంగ్లీని ఎలా దగ్గరకు చేర్చుకుంటారని ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో చిన్న బొచ్చుకోవడం రామ్మోహన్ నాయుడు వంతు అయింది.
తాజాగా టిడిపి సోషల్ మీడియాకు నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టార్గెట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత. ఇంతకీ ఆయనపై విషప్రచారం ఎందుకంటే ప్రధానితో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని కలిపారు అన్న కోపం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన అక్కినేని నాగార్జునతో పాటు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇటీవల ప్రధానిని కలిశారు. వారితో పాటే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. వైసీపీ మద్దతుదారులుగా ఉన్న వారిని ఎందుకు ప్రధానిని కలిపారు అన్నది టిడిపి సోషల్ మీడియా ఆగ్రహం. దీంతో కృష్ణ దేవరాయలు టార్గెట్ అయ్యారు. ఇలా టిడిపి నేతలే సొంత సోషల్ మీడియా విభాగానికి టార్గెట్ అవుతుండడం విశేషం.