వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్. రాష్ట్రంలో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉన్న గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. గడిచిన ఎన్నికల్లో విశాఖ నగరపాలక సంస్థను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు ఏడాది ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతోంది కూటమి.
98 డివిజన్లు కలిగిన గ్రేటర్ విశాఖలో 58 మంది కార్పొరేటర్లతో తిరుగులేని విజయం నమోదు చేసింది ఫ్యాన్ పార్టీ. టిడిపికి 29 డివిజన్లు రాగా.. జనసేనకు మూడు డివిజన్లు దక్కాయి. బిజెపితో పాటు వామపక్షాలకు చిరోస్థానం దక్కింది. మరో నలుగురు ఇండిపెండెంట్ లు కూడా ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో సీన్ మారింది. గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమి ఖాతాలో పడ్డాయి. దీంతో కార్పొరేటర్లు రూట్ మార్చారు. కూటమి పార్టీల్లో చేరారు. దీంతో కూటమికి బలం పెరిగింది.
వాస్తవానికి స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలకు నాలుగేళ్లు నిబంధన ఉంది. ఆ నిబంధన నేటితో ముగియనుంది. అందుకే కూటమి అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే అక్కడ మేయర్ గా బీసీ వర్గానికి చెందిన గొలగాని సూర్య హరి కుమారి ఉన్నారు. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ నేత. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో క్యాస్ట్ ఈక్వేషన్ అక్కడ తెరపైకి వస్తోంది. విశాఖ నగరంలో యాదవ సామాజిక వర్గం అధికం. ఒకవేళ అవిశ్వాసం పెట్టి మేయర్ పోస్ట్ నుంచి హరి కుమారిని దించితే మాత్రం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం కావడం తథ్యం.
వాస్తవానికి పొత్తులో భాగంగా యాదవ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. కూటమి తరుపున ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు. ఆ అసంతృప్తి బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అంటే కూటమిపై వ్యతిరేకత రావడం ఖాయం. అయితే కేవలం రాజకీయ కోణంలో చూస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు హై కమాండ్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. మేయర్ పదవి నుంచి దిగిపోవడం ఖాయంగా తేలుతోంది. కానీ అదే జరిగితే కూటమి పార్టీలకు యాదవ సామాజిక వర్గం దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది.