మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఒక విమర్శ ఉండేది. ఆయన భూమిపై తిరగరు.. ఆకాశంలో మాత్రమే తిరుగుతారని. పదవీకాలంలో ఆయన హెలికాప్టర్లో మాత్రమే తిరిగేవారని.. పది కిలోమీటర్ల లోపు అయినా సరే గాలిలోనే తిరిగేవారని ఎల్లో మీడియా పతాక శీర్షికలో వార్తలు రాసేది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిని ఆరోపించేది. కానీ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే ఆకాశమార్గంలో తిరుగుతున్న ఎల్లో మీడియా పట్టించుకోకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన ప్లీనరీ పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాదులోని మాదాపూర్ నుంచి పిఠాపురంలోని చిత్రాల వరకు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ వచ్చే హెలికాప్టర్ రూటు మార్గానికి సంబంధించిన వైర్లెస్ మెసేజ్ షీట్ను వైసిపి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాదులోని మాదాపూర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు పవన్ కళ్యాణ్. ఉదయం 10:40 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:55 గంటలకు మంగళగిరిలోని పార్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అంటే పది నిమిషాల ప్రయాణానికి కూడా హెలిక్యాప్టర్ వాడిన విషయాన్ని బయటపెట్టింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
గతంలో జగన్మోహన్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రయాణాలపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తరచూ విమర్శలు చేసేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవని బీద అరుపులు ఏడ్చే పవన్ కళ్యాణ్ కు ప్రజల డబ్బు అంటే లెక్క లేదని.. గన్నవరం నుంచి మంగళగిరి కూడా లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని.. ప్రజల అవస్థల్లో ఉన్నప్పుడు మాత్రం ఏనాడు ఇంత హుటాహుటిన బయలుదేరి వెళ్లిన దాఖలాలు లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
జగన్ పర్యటన ఉన్న సమయంలో ఎల్లో మీడియా ఒక కాలంను ప్రత్యేకంగా కేటాయించేది. ఆకాశమార్గంలో జగన్మోహన్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో ఉంటే రోడ్డుపై ట్రాఫిక్ జామ్.. ప్రజల ఆక్రందనలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి… ఇలా పతాక శీర్షికలో కథనాలు రాసేది. కానీ ఇప్పుడు అదే ఎల్లో మీడియాకు పవన్ కళ్యాణ్ చర్యలు మాత్రం కనిపించకపోవడం విశేషం.